Site icon vidhaatha

Chennamaneni Ramesh | ఓటర్ జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పేరు తొలగింపు

Chennamaneni Ramesh | వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరును ఎన్నికల ఓటరు జాబితా నుంచి తొలగిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రమేష్ బాబు ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. తెలంగాణ హైకోర్టు చెన్నమనేనిని జర్మనీ పౌరుడని నిర్ధారించినందున.. ఎన్నికల ఓటరు జాబితా నుంచి ఫామ్-7 ప్రకారం ఆయన పేరును తొలగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అధికారులు రమేష్ నివాసం వేములవాడలోని సంగీత నిలయంలో నోటీసు అందజేసి, రిజిస్ట్రార్ పోస్ట్ ద్వారా సమాచారం పంపారు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 2 తేదీ లోగా సమాధానం ఇవ్వాలని తెలిపారు అధికారులు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు రెవెన్యూ అధికారులు.

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని 2024 డిసెంబర్ 9న తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పౌరసత్వం కేసులో తప్పుడు ధృవపత్రాలతో కేసును తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగాను 30 లక్షల జరిమానా విధించింది. అందులో రూ. 25 లక్షలను పిటిషనర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల రోజుల్లో చెల్లింపులు మొత్తం పూర్తిచేయాలని హైకోర్టు చెన్నమనేని రమేష్ ను ఆదేశించింది.

Exit mobile version