Chennamaneni Ramesh |
విధాత: పౌరసత్వం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh) సోమవారం జరిమానా చెల్లించారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై గత 15 ఏళ్లుగా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేశారు. ఈ కేసులో చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడని గతంలో గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు పత్రాలతో అధికారులను, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని, ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఇక్కడ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
చెన్నమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. విచారణ సమయంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని కోర్టు మండిపడింది. కోర్టు ఖర్చుల కింద చెన్నమనేని రూ.30 లక్షలు చెల్లించాలని గత డిసెంబర్ లో హైకోర్టు తీర్పు చెప్పింది. రూ.30 లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. చెన్నమనేని రమేష్ తప్పు ఒప్పుకుని కోర్టు ఖర్చుల కింద రూ. 30 లక్షలు చెల్లించారు. సోమవారం హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ సమక్షంలో ఆది శ్రీనివాస్ కు రూ.25 లక్షల డీడీని చెన్నమనేని రమేష్ తరపు న్యాయవాది అందించారు.
నిజం నిలకడమీదైన వెల్లడి ఖాయం: ఆది శ్రీనివాస్
నిజం నిలకడ మీద తెలుస్తుందనడానికి చెన్నమనేని రమేశ్ పై నేను వేసిన కేసునే నిదర్శనమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. 2009లో తప్పుడు పద్దతిలో భారతదేశ పౌరసత్వం పొందిన చెన్నమనేని నాపై పోటీ చేసి గెలుపొందారన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు దీనిపై న్యాయపోరాటం చేస్తూ వచ్చానన్నారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని..జర్మనీ పౌరుడని నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని..15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో న్యాయమే గెలిచిందన్నారు. కోర్టులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని చెప్పారు.
మా ప్రాంత ప్రజలకు చెన్నమనేని రమేష్ నిజస్వరూపం ఏంటో ఇప్పటికైనా తెలిసిపోయిందన్నారు. ప్రపంచంలోనే దేశ పౌరుడు కాకుండా ఆ దేశంలోని చట్టసభలలో సభ్యుడైన చరిత్ర చెన్నమనేనికే చెల్లించిందన్నారు. చెన్నమనేని తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేయకుంటే పదేళ్ల క్రితమే నేను ఎమ్మెల్యే అయ్యేవాడినని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలను ఇంతకాలం మోసం చేసిన చెన్నమనేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.