Longest Tongue | పొడవైన మనషులు.. పొట్టి మనషులు.. పొడవైన జుట్టు.. పొడవైన గోర్లు.. ఇవన్నీ ప్రపంచ దృష్టిని ఆకర్షించినవే. ఇలాంటి వారు గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness World Record ) కూడా సృష్టించారు. వీటికి భిన్నంగా ఓ మహిళ ప్రపంచ దృష్టిని ఆకర్షించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించి.. వార్తల్లో నిలిచింది. మరి ఆ మహిళకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచంలోనే ఆమెది అత్యంత పొడవైన నాలుక(Longest Tongue ).
యూఎస్ఏలోని కాలిఫోర్నియాకు చెందిన చానెల్ టాపర్.. అసాధారణ నాలుకను కలిగింది. సాధారణ నాలుక కంటే రెండు రెట్ల పొడవును అధికంగా కలిగి ఉంది ఆమె. టాపర్ నాలుక పొడవు 9.75 సెంటిమీటర్లు(3.8 ఇంచులు). ఈ అసాధారణ నాలుక ప్రపంచ దృష్టిని ఆకర్షించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.
ఈ సందర్భంగా టాపర్ మాట్లాడుతూ.. తనకు ఎనిమిదేండ్ల వయసున్నప్పుడు తన నాలుక పొడవుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. తన తల్లితో కలిసి హాలోవీన్ ఫొటో సెషన్‌లో పాల్గొన్నప్పుడు ఈ విషయం బయటపడిందని తెలిపింది. ఈ రోజు ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టిస్తానని ఊహించలేదని టాపర్ పేర్కొంది. టాపర్ నాలుక ఐ ఫోన్ పొడవుతో సమానం.
పురుషుల్లో నిక్ గిన్నిస్ వరల్డ్ రికార్డు..
ఇక పురుషుల విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అతి పొడవైన నాలుకను కలిగి ఉన్న వ్యక్తిగా.. నిక్ స్టోబెర్ల్(అమెరికా) నిలిచారు. నిక్ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇతని నాలుక 10.1 సెంటిమీటర్లు(3.97 ఇంచులు) పొడవు ఉంది.
అతి వెడల్పైన నాలుక ఆమెదే..
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బ్రిట్టనీ లకాయో 7.90 సెం.మీ(3.11 అంగుళాలు) నాలుకతో ప్రపంచంలోనే అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డ్ అంత వెడల్పు ఉంది.