Mohammed Nizamuddin | హైదరాబాద్ : అమెరికా పోలీసుల తూటాలకు పాలమూరు యువకుడు బలయ్యాడు. ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లిన మహమ్మద్ నిజాముద్దీన్.. అమెరికా పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురవడం అతని కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్యబౌలికి చెందిన హసనుద్దీన్ రిటైర్డ్ టీచర్ కాగా, ఆయన కుమారుడు మహమ్మద్ నిజాముద్దీన్ డిసెంబర్ 2016లో అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసి, కాలిఫోర్నియాలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆరు నెలల కిందట ఉద్యోగ ఒప్పందం ముగిసింది. దీంతో ఆ ఉద్యోగం కొనసాగింపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు నిజాముద్దీన్. ఇంతలోనే నిజాముద్దీన్ పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లు హసనుద్దీన్‌కు సమాచారం అందింది.
తన కుమారుడు మహమ్మద్ నిజాముద్దీన్‌ను అమెరికా పోలీసులు కాల్చి చంపారని, ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారో తెలియడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవ తీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకు తీసుకు రావడంలో సహకరించాలని కోరారు.
సెప్టెంబర్ 3వ తేదీన ఒక నివాసంలో ఇద్దరు రూమ్‌మేట్ల మధ్య ఏదో విషయమై ఘర్షణ జరుగుతున్నట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్లిన పోలీసు అధికారి క్లిష్ట పరిస్థితుల్లో కాల్పులు జరిపారని పేర్కొన్నారు. అయితే నిజాముద్దీన్ తన రూమ్‌మేట్‌పై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈక్రమంలో పోలీసులు లొంగి పోవాల్సిందిగా నిజాముద్దీన్‌కు సూచించారు. కానీ అతడు మాట వినకపోవడంతో కాల్పులు జరిపారు. ఫలితంగా నిజాముద్దీన్ చనిపోయాడు. అతడు మరణించిన రెండు వారాల తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా నిజాముద్దీన్ స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో దీని గురించి తెలిసింది.