చాట్ జీపీటీ యాజ‌మాన్య సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓకు ఉద్వాస‌న‌..

కృత్రిమ మేధ (Artificial Intelligence) ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సామాన్యుల‌కు ప‌రిచ‌యం చేసిన చాట్ జీపీటీ (Chat GPT) యాజ‌మాన్య సంస్థ ఓపెన్ ఏఐ (Open AI) సంస్థ‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది

  • Publish Date - November 18, 2023 / 09:39 AM IST

విధాత‌: కృత్రిమ మేధ (Artificial Intelligence) ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సామాన్యుల‌కు ప‌రిచ‌యం చేసిన చాట్ జీపీటీ (Chat GPT) యాజ‌మాన్య సంస్థ ఓపెన్ ఏఐ (Open AI) సంస్థ‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సంస్థ సీఈఓ అయిన సామ్ ఆల్ట్‌మ‌న్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ఓపెన్ ఏఐ శ‌నివారం ప్ర‌క‌టించింది. కొన్ని వ్య‌వ‌స్థాగ‌త‌మైన విష‌యాల‌ను బోర్డుకు తెలియ‌నివ్వ‌కుండా ఆల్ట్‌మ‌న్ (Sam Altman) ప్ర‌య‌త్నించారనేది ఆయ‌న‌పై ఉన్న ప్ర‌ధాన అభియోగంగా ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.


పైస్థాయిలో జ‌రిగిన స‌మీక్ష‌లు, రివ్యూ మీటింగ్‌ల అనంత‌రం ఆల్ట్‌మ‌న్‌ను త‌ప్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. అత‌డి వైపు నుంచి పొర‌పాటు జ‌రిగింది. సంస్థ‌కు స‌మాచారాన్ని చేర‌వేయ‌డంలో చిత్త‌శుద్ధిని క‌న‌బ‌ర‌చ‌లేద‌ని వెల్ల‌డైంది. దీంతో చాట్‌జీపీటీని ముందుకు తీసుకెళ్ల‌డానికి అత‌డు స‌రైన వ్య‌క్తి కాద‌ని భావిస్తున్నాం అని ఓపెన్ ఏఐ వెల్ల‌డించింది. ఓపెన్ ఏఐను ముందుకు తీసుకెళ్ల‌డంలో సామ్ పాత్ర కీల‌క‌మైన‌ద‌ని.. అయితే ఆ బాధ్య‌త‌ల‌ను కొత్త నాయ‌క‌త్వానికి ఇవ్వ‌డం కూడా అత్య‌వ‌స‌ర‌మ‌ని పేర్కొంది.


ఈ తొల‌గింపు వార్త‌లు బ‌య‌ట‌కు రాగానే.. ఓపెన్ ఏఐ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్రెసిడెంట్‌గా ఉన్న గ్రెగ్ బ్రాక్‌మ‌న్ సైతం త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎనిమిదేళ్ల క్రితం ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో ఓపెన్ ఏఐను ప్రారంభించ‌డం ఇంకా గుర్తుంది. అంద‌రం క‌లిసి ఎన్నో ఎత్తుల‌ను, లోతుల‌ను చూశాం. అంద‌రి కృషి వ‌ల్లే ఈ రోజు విజ‌యం సాధ్య‌మైంది. కానీ ప్రస్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఓపెన్ఏఐకు రాజీనామా చేయాల్సి వ‌స్తోంది అని గ్రెగ్ పేర్కొన్నారు.


నేను ఓపెన్ ఏఐలో ఉన్న స‌మ‌యాన్ని చాలా ఇష్ట‌ప‌డ్డాను. న‌న్ను నేను మార్చుకోవ‌డానికి ఆ స‌మ‌యం ఉప‌యోగ‌ప‌డింది. త‌ర్వాత ఏంట‌నేది చెప్ప‌డానికి చాలా విష‌యాలు పంచుకోవాల్సి ఉంటుంది అని ఆల్ట్‌మ‌న్ ఎక్స్‌లో స్పందించాడు. మ‌రోవైపు ఆల్ట్‌మ‌న్ స్థానంలో ఓపెన్ ఏఐలో చీఫ్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్న మిరా మురాతీని తాత్కాలికంగా నియమించారు. ఆ ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తి కోసం అన్వేష‌ణ ప్రారంభించిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ వార్త‌ల‌తో ఓపెన్ ఏఐకు యాజ‌మాన్య సంస్థ‌గా ఉన్న మైక్రోసాఫ్ట్ షేర్లు కొంత‌మేర న‌ష్ట‌పోయాయి.