విధాత : చైనాలోని నైరుతి ప్రావిన్స్ సిచువాన్‌లో ఇటీవలే ప్రారంభించిన నూతన హాంగ్కీ వంతెన కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ మారింది. 758 మీటర్ల పొడవైన హాంగ్కీ వంతెన చైనా దేశ కేంద్ర భూభాగాన్ని టిబెట్‌తో కలుపుతుంది. నిర్మాణ ప్రమాణాలలో ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన చైనీయన్లకు ఈ వంతెన కూలిన ఘటన అప్రతిష్టగా మారింది. వంతెన నిర్మాణ ప్రమాణాలపై స్థానికులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం మాత్రమే ప్రారంభించబడిన ఈ వంతెన అకస్మాత్తుగా కూలిపోగా..వంతెన భాగాలు దిగువన ఉన్న నీటిలోకి పడిపోయాయి. వంతెన కూలిన ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ వంతెన షువాంగ్జియాంగ్కో జలవిద్యుత్ ప్రాజెక్టు సమీపంలో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టగా నిలిచే ఈ ప్రాజెక్టు మే 1న నీటిని నిల్వ చేయడం ప్రారంభించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ గతంలో నివేదించింది.
కొండచరియలు విరిగి పడటంతోనే ఘటన
వంతెన కూలిపోవడానికి ముందు రోజునే మేర్కాంగ్ నగరం పోలీసులు వంతెనపై ట్రాఫిక్ నిలిపివేశారు. సమీపంలోని వాల్స్, రోడ్లపై పగుళ్లు కనిపించడం, స్థానిక పర్వత భూభాగంలో మార్పులు కనిపించడంతో ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ నిలిపివేయడంతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. మరుసటి రోజున పర్వతప్రాంతంలో పరిస్థితులు మరింత దిగజారి, కొండచరియలు విరిగిపడటంతో అప్రోచ్ వంతెన, రోడ్‌బెడ్ కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు.ఈ సంవత్సరం ప్రారంభంలో వంతెన నిర్మాణం పూర్తయ్యిందని కాంట్రాక్టర్ సిచువాన్ రోడ్ , బ్రిడ్జ్ గ్రూప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపింది. చైనా డైలీ కథనం మేరకు ఈ వంతెన మార్గాన్ని తిరిగి పునరుద్దరించడానికి ఎటువంటి అంచనా సమయం లేదని స్థానిక అధికారులు తెలిపారు.
🚨 A recently opened bridge collapsed in China's southwestern province of Sichuan, linking the country's heartland with Tibet. pic.twitter.com/oNmAE1xZQ5
— Indian Tech & Infra (@IndianTechGuide) November 11, 2025
