కొవిడ్ కన్నా ప్ర‌మాదకర వైర‌స్‌తో చైనా ప‌రిశోధ‌కుల చెల‌గాటం?

కొవిడ్ వైర‌స్ పుట్టుక‌, వ్యాప్తిపై ఇప్ప‌టికే చైనా పై అనేక అనుమానాలు ఉండ‌గా.. ఆ దేశం మ‌రో ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌తో ప్ర‌యోగాలు చేస్తోంద‌ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

  • Publish Date - January 16, 2024 / 10:24 AM IST

కొవిడ్ (Covid) వైర‌స్ పుట్టుక‌, వ్యాప్తిపై ఇప్ప‌టికే చైనా (China) పై అనేక అనుమానాలు ఉండ‌గా.. ఆ దేశం మ‌రో ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌తో ప్ర‌యోగాలు చేస్తోంద‌ని కొన్ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఒక వేళ ఈ నివేదిక‌లు నిజ‌మ‌ని అనుకుంటే ప్ర‌పంచం మ‌రోసారి కొవిడ్ త‌ర‌హా ఉత్పాతాన్ని చ‌విచూడ‌క త‌ప్ప‌ద‌ని శాస్త్రవేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. బ‌యో ఆర్ఎక్స్ఐవీ అనే వెబ్‌సైట్‌లో తాజాగా ప్ర‌చురిత‌మైన క‌థ‌నం (Study) ప్ర‌కారం.. చైనా ప‌రిశోధ‌కులు ఈ సారి పాంగోలియ‌న్ వైర‌స్‌పై ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఎల‌క‌లపై ఇది 100 శాతం ప్రాణాంత‌కంగా మారుతోంద‌ని.. మ‌నుషుల‌కూ అదే స్థాయిలో న‌ష్టం క‌లిగిస్తుంద‌ని ఆ క‌థ‌నం అభిప్రాయ‌ప‌డింది. పాంగోలియ‌న్ వైర‌స్‌ను సేక‌రించి దానికి చైనా సైన్యం మ‌రిన్ని మెరుగులు దిద్దింద‌ని ఈ క‌థ‌నం ఆరోపించింది.


ఒకానొక ప‌రిశోధ‌న‌లో భాగంగా నాలుగు ఎల‌క‌ల‌కు మార్పు చేసిన పాంగోలిన్ వైర‌స్‌ను ఎక్కించారు. అన్ని ఎల‌క‌లూ 7 లేదా 8 రోజుల‌కు పూర్తిగా ఈ వైర‌స్ బారిన ప‌డి ఇన్ఫెక్ష‌న్‌కు గుర‌య్యాయి. అయిదు రోజులు అయ్యేట‌ప్ప‌టికి నాలుగు ఎలుక‌లూ బ‌రువును పూర్తిగా కోల్పోయాయి. ఏడో రోజు వ‌చ్చే స‌రికి వాటి రంగు మారిపోయింది. క‌ళ్లు కూడా తెల్ల‌గా మారిపోయాయి. వైర‌స్ సోకిన ఆరో రోజుకే వాటి ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం దారుణంగా ప‌డిపోయింది. మెద‌డు పూర్తిగా మొద్దుబారిపోయింది. ఆ త‌ర్వాత ఆ నాలుగు ఎల‌క‌లూ చ‌నిపోయాయి. వీటి చావుకు ప్ర‌ధాన కార‌ణంగా మెద‌డు పూర్తిగా దెబ్బ‌తిన‌డ‌మేన‌ని వెబ్‌సైట్ క‌థ‌నం పేర్కొంది. ఈ వైర‌స్ మ‌నుషుల‌కు సోకినా ఇదే విధ‌మైన మార్పులు చోటుచేసుకుని మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. మ‌రోవైపు చైనా శాస్త్రవేత్త‌లు కొవిడ్ వ్యాప్తిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో మ‌రోసారి కొవిడ్ విజృంభించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. జేఎన్‌1 ఉత్ప్రేర‌కం వ్యాప్తి ఎక్కువ‌గా ఉంద‌ని.. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.