- జనతా విముక్తి పెరమునకు జైకొట్టిన శ్రీలంక
SRI LANKA POLL । సంక్షుభిత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్ జనం విప్లవాత్మక మార్పును ఎంచుకున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్టు పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అనుర కుమార దిస్సనాయకే ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు విడుదల చేసిన వివరాల ప్రకారం.. దిస్సనాయకేకు సుమారు 7,27,000 ఓట్లు లభించాయి (52%). సమీప ప్రధాన ప్రత్యర్థి సాజిత్ సుమారు 3,33,000 (23%) ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఘోర పరాజయం పొందారు. 2,35,000 (16%)ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఫలితాల నేపథ్యంలో ద్వీపదేశమైక శ్రీలంకలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి.
మార్క్సిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే జేవీపే నేతగా గతంలో కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా.. ఈసారి దిస్సనాయకే ప్రధాన ప్రత్యర్థిగా ముందుకు దూసుకొచ్చారు. భారీగా అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకలో అవినీతిపై పోరాటం, స్వచ్ఛమైన పాలన నినాదాలతో ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2022 నాటి అరగలయ ఉద్యమంలో భాగస్వాములైన ప్రజలు, ప్రత్యేకించి యువత జేవీపీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు సైతం అండగా నిలువడంతో ఆయన విజయం సునాయాసమైంది. 2022 తర్వాత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయి అస్తవ్యస్తమైన శ్రీలంకను సాధారణ స్థితికి చేర్చే క్రమంలో దిస్సనాయకేకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి.