Doing Nothing | ఏమీ చేయ‌నందుకు.. గంట‌కు రూ.5,679 సంపాదిస్తున్న వ్య‌క్తి

Doing Nothing | ఓ ల‌క్ష్యం అంటూ లేకుండా తిరుగుతున్నావ‌ని.. జీవితంలో పైకొచ్చే ఉద్దేశం నీకు లేదు అనే త‌ర‌హా దెప్పిపొడుపు మాట‌లు చాలా మంది జీవితాల్లో ఎదుర‌య్యే ఉంటాయి. జ‌పాన్‌ (Japan)కు చెందిన షోజి మోరిమోటో అనే 38 ఏళ్ల వ్య‌క్తికీ ఒక‌ప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లే ఎదుర‌య్యాయి. అయితే అంద‌రిలాగా ఆ ప్ర‌శ్న‌ల‌కు భ‌య‌ప‌డి న‌చ్చ‌ని ప‌ని చేయ‌లేదు. త‌న స‌హ‌జ సిద్ధ గుణ‌మైన‌ ఏ ప‌నీ చేయ‌ని (Do Nothing) స్వ‌భావాన్ని వ్యాపారంగా మ‌లుచుకున్నాడు. […]

  • Publish Date - August 2, 2023 / 05:39 AM IST

Doing Nothing |

ఓ ల‌క్ష్యం అంటూ లేకుండా తిరుగుతున్నావ‌ని.. జీవితంలో పైకొచ్చే ఉద్దేశం నీకు లేదు అనే త‌ర‌హా దెప్పిపొడుపు మాట‌లు చాలా మంది జీవితాల్లో ఎదుర‌య్యే ఉంటాయి. జ‌పాన్‌ (Japan)కు చెందిన షోజి మోరిమోటో అనే 38 ఏళ్ల వ్య‌క్తికీ ఒక‌ప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లే ఎదుర‌య్యాయి.

అయితే అంద‌రిలాగా ఆ ప్ర‌శ్న‌ల‌కు భ‌య‌ప‌డి న‌చ్చ‌ని ప‌ని చేయ‌లేదు. త‌న స‌హ‌జ సిద్ధ గుణ‌మైన‌ ఏ ప‌నీ చేయ‌ని (Do Nothing) స్వ‌భావాన్ని వ్యాపారంగా మ‌లుచుకున్నాడు. ఏమీ చేయ‌క‌పోతే డ‌బ్బులు ఎలా అని అడ‌క్కండి.. ఏ ప‌నీ చేయ‌నందుకే అత‌డికి గంట‌కు సుమారు ఏకంగా 10 వేల యెన్ (రూ.5,679)లు వ‌స్తున్నాయి. అలా ఇప్పుడు ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతోంది.

ఏం వ్యాపారం అది?

షోజి చేసే వ్యాపారం పేరు ‘న‌న్ను రెంట్‌కి తీసుకోండి’. 2018లో ఇదే పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. త‌నను తాను అద్దెకు ఇచ్చుకోవ‌డ‌మే ఇందులో ఉండే పెట్టుబ‌డి. త‌న‌ను రమ్మ‌నే వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. వారితో త‌న స‌మ‌యాన్ని వెచ్చిస్తాడు. అక్క‌డ కూడా షోజి చేసేది డూ న‌థింగే.. త‌న‌కు తానుగా వారితో మాట్లాడ‌డు. వారిని మెప్పించాల‌ని చూడ‌డు. వారు త‌మ బాధ‌లు చెప్పుకొంటుంటే వింటాడు.

క‌న్నీటిని తుడుస్తాడు. త‌మ సంతోషాలు పంచుకుంటుంటే వారితో క‌లిసి ఆనందిస్తాడు. వారు కోరుకున్న స‌మ‌యం అయిపోయాక అక్క‌డితో ఆ జ్ఞాప‌కాలు వ‌దిలేసి వ‌చ్చేస్తాడు. మ‌ళ్లీ మ‌రో క్ల‌యింట్‌తో ప్ర‌యాణం. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా త‌న జీవితంలోని సుమారు 4 వేల గంట‌ల‌ను త‌న‌ను కోరుకున్న వారికి ఇచ్చాడు. వ్యాపారం ప్రారంభించిన నాలుగెళ్ల‌తో ఎప్పుడూ తాను ఖాళీగా లేన‌ని షిజో చెబుతున్నాడు.

ఈ ప్ర‌యాణంలో కొన్ని సార్లు త‌న‌కు స్నేహితుడిగా ఉండాల‌ని, బ‌ట్ట‌లు ఉత‌కాల‌ని, పాడు బ‌డిన ఇళ్ల‌ల్లోకి వెళ్లాల‌ని, న‌గ్నంగా త‌మ ముందు కూర్చోవాల‌ని త‌రహా అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయని.. అవి చేస్తే బాగా డ‌బ్బులొచ్చే అవ‌కాశమున్నా డూ న‌థింగ్ సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని పేర్కొన్నాడు. కొన్ని సార్లు త‌న‌కు తానుగా వీధిలో సంగీతం వాయించే వాద్య‌కారుడి వ‌ద్ద నిల‌బ‌డి వింటూ ఉంటాన‌ని.. అప్పుడు ఆ మ్యుజిషియ‌న్ క‌ళ్లల్లో క‌నిపించే ఆనందం త‌న‌కు చాలని చెప్పుకొచ్చాడు.

కొంత మంది త‌న‌ను ప‌దే ప‌దే కోరుకుంటార‌ని.. అలా ఒక క్ల‌యింటు ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 270 సార్లు త‌నతో స‌మ‌యాన్ని కోరుకున్నార‌ని తెలిపాడు. ప్రస్తుతం షోజికి రోజుకి మూడు బుకింగ్స్ ఉంటాయి. చాలా మంది జీవించ‌లేని జీవితాన్ని గ‌డుపుతున్న షోజి.. మంచి ర‌చ‌యిత కూడా. ఇప్ప‌టికి నాలుగు పుస్త‌కాలు ర‌చించాడు.

త‌న క్ల‌యింట్స్‌తో ఎలా ఉంటాడు.. ఏం నేర్చుకున్నాడు అనేది వివ‌రిస్తూ మ్యాంగా కామిక్ అనే ఒక పుస్త‌కం అందులో ఒక‌టి. షిజో జీవితం ఆధారంగా అమెజాన్ ప్రైంలో ఒక సిరీస్ కూడా వ‌చ్చింది. అయితే ఈ వ్యాపారంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత సంపాదించార‌నే ప్ర‌శ్న‌కు షిజో స‌మాధానం ఇవ్వ‌లేదు. త‌న భార్య‌, పాప‌ల‌ను సౌక‌ర్య‌వంతంగా చూసుకోవ‌డానికి కావాల్సినంత డ‌బ్బు సంపాదిస్తున్నాన‌ని తెలిపాడు.

మ‌న‌మూ పెట్టొచ్చా..?

అయితే ఈ వ్యాపారం అన్ని దేశాల్లోనూ విజ‌య‌వంత‌మ‌వుతుంద‌న్న గ్యారెంటీ లేదు. ప‌ని ఒత్తిడిలో ప‌డి బంధాల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం జ‌పాన్‌లో ఎక్కువ‌. అందుకే ఒంట‌రిత‌నంతో బాధ‌ప‌డేవారు ఎక్కువ‌గా ఉండే ఆ దేశంలో ఈ త‌ర‌హా వ్యాపారాల‌కు అవ‌కాశం ఉంటుంది. ఆఖ‌రికి ప‌రిస్థితి ఎలా మారిపోయిందంటే జ‌పాన్‌లో ఒంట‌రి త‌నాన్ని నియంత్రించ‌డానికి ఏకంగా లోన్లీనెస్ (Loneliness) అనే మంత్రిత్వ శాఖ‌ను ప్రారంభించారు.