Site icon vidhaatha

BANGLADESH | బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల

అవినీతి ఆరోపణలపై 2018 నుంచి జైల్లోనే
ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కే పరిమితం
అధ్యక్ష భవనం ఆదేశాలతో ఎట్టకేలకు విడుదల

ఢాకా : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, కీలక ప్రతిపక్ష నేత ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి, భారత్‌కు పరారైన నేపథ్యంలో ఆమె జైలు జీవితం నుంచి విముక్తి పొందారు. హసీనా రాజీనామా చేసిన కొద్ది గంటలకు దేశాధ్యక్షుడు షహబుద్దీన్‌.. మాజీ ప్రధాని ఖలీదా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ‘బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) చైర్‌పర్సన్‌ బేగం ఖలీదా జియాను తక్షణమే విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు’ అని అధ్యక్ష భవనం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
విద్యార్థి ఆందోళనల సందర్భంగా అరెస్టయిన అందరినీ విడుదల చేయాలని కూడా అధ్యక్ష భవనం నిర్ణయించిందని ఆ ప్రకటనలో తెలిపారు.

అవినీతి ఆరోపణలపై 2018 నుంచి ఖలీదా జియా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 79 ఏళ్లు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆమె హాస్పిటల్‌కే పరిమితమయ్యారని డైలీ స్టార్‌ తెలిపింది. షేక్‌ హసీనాకు బద్ధవిరోధిగా పేర్కొనే జియా.. అనాధల ట్రస్ట్‌కోసం ఉద్దేశించిన 2,50,000 డాలర్లను అమె తన అధికారాలను ఉపయోగించి దుర్వినియోగం చేశారని అభియోగాలు ఉన్నాయి. అయితే.. ఇవన్నీ తప్పుడు కేసులేనని బీఎన్‌పీ ఆరోపిస్తున్నది. రెండు పర్యాయాలు బంగ్లాదేశ్‌ ప్రధానిగా ఉన్న ఖలీదా జియాను రాజకీయాలకు దూరంగా ఉంచేందుకే ఆమెపై తప్పుడు కేసులు బనాయించారని విమర్శిస్తున్నది.

బంగ్లాదేశ్‌కు 1991 నుంచి 1996 వరకు ఒక సారి, 2001 నుంచి 2006 వరకూ రెండోసారి ఖలీదా జియా ప్రధాన మంత్రిగా పనిచేశారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఖలీదా జియా విజయం సాధించినప్పటికీ ఆ ఎన్నికలను షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ సహా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఈ ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగలేదని ఆరోపించాయి. ఫలితంగా జియా ప్రభుత్వం 12 రోజులకే కుప్పకూలింది. అనంతరం ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది.
ఖలీదా జియా లివర్‌ సోరియాసిస్‌, అర్థ్రరైటిస్‌, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక ఇబ్బందులతోపాటు కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె, కంటి సంబంధ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని డైలీ స్టార్‌ పేర్కొన్నది.

Exit mobile version