Site icon vidhaatha

Sheikh Hasina | తండ్రి తెచ్చిన రిజ‌ర్వేష‌న్లు.. కూతుర్ని దేశం విడిచి పారిపోయేలా చేశాయి.. అస‌లేంటి ఈ రిజ‌ర్వేష‌న్ల గోల‌..?

Sheikh Hasina | ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా వినిపిస్తున్న పేరు బంగ్లాదేశ్‌( Bangladesh ).. ఇప్పుడు ఈ దేశం ఉద్రిక్త ప‌రిస్థితుల‌తో అట్టుడికిపోతోంది. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌షీనా( Sheikh Hasina ) దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ ఇలా మారిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం రిజ‌ర్వేష‌న్లు( Reservations ). అస‌లు ఈ రిజ‌ర్వేష‌న్ల గోల ఏంటో తెలుసుకోవాలంటే 1947లో ఏం జ‌రిగిందో త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి.

1947లో ప్రస్తుతమున్న బంగ్లాదేశ్‌ను అప్పట్లో ఈస్ట్ పాకిస్థాన్( East Pakistan ), ఇప్పుడున్న పాకిస్థాన్‌ను వెస్ట్ పాకిస్థాన్( West Pakistran ) అనే వాళ్లు. ఈస్ట్ పాకిస్థాన్‌, వెస్ట్ పాకిస్థాన్‌ను కలిపి ఒక దేశంగా ప్రకటించారు బ్రిటిష‌ర్స్. అయితే ఈ రెండు దేశాల మధ్య దూరం 2,204 కిలోమీట‌ర్లు. మ‌రి ప్రతి 50 కిలోమీటర్లకే ఆచార వ్య‌వ‌హారాలు, సంప్ర‌దాయాలు, సంస్కృతి మారిపోతోంది. అంతేకాకుండా.. ప‌రిపాల‌న రీత్యా కూడా అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయి. దీంతో 1971లో పాకిస్థాన్ నుంచి ఈస్ట్ పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్( Bangladesh ) అనే కొత్త దేశంగా అవతరించింది. 1947లో బ్రిటీష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 25 ఏండ్ల‌కే పాకిస్థాన్( Pakistan ) నుంచి స్వాతంత్య్రం పొందడం అంటే మాటలు కాదు. అందుకే.. 1971 లిబ‌రేష‌న్ వార్‌( Liberation War )లో పాల్గొన్న సైనికుల వార‌సుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు, విద్య, ఉపాధి అవకాశాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు 1972లో అప్పటి ప్రధాని షేక్ ముజిబర్ రెహ్మాన్( Sheikh Mujibur Rahman) ఆదేశాలిచ్చారు. ఈయన ఎవరో కాదు.. నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హాసినా తండ్రి.

56 శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 30 శాతం కోటా లిబ‌రేష‌న్ వార్‌లో పాల్గొన్న వారికే..

ఈ 30 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్‌తో పాటు వారి కుమారుల‌కు కూడా షేక్ ముజిబ‌ర్ రెహ్మ‌న్ కొన‌సాగించారు. త‌మ కుటుంబ భ‌విష్య‌త్‌ను ఫ‌ణంగా పెట్టి పోరాటం చేశారు కాబ‌ట్టి కుమారుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంలో త‌ప్పులేద‌ని నాడు భావించారు. కానీ మూడో త‌ర‌మైన మ‌నువ‌ళ్ల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించ‌డాన్ని బంగ్లాదేశ్ యువ‌త త‌ప్పుబ‌ట్టింది. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్‌లో 56 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల్లో ఉన్నాయి. కేవ‌లం 44 శాతం మాత్ర‌మే ఓపెన్ కేట‌గిరీ. ఈ 56 శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 30 శాతం కోటా లిబ‌రేష‌న్ వార్‌లో పాల్గొన్న వారికే వ‌ర్తిస్తుంది. 30 శాతం రిజ‌ర్వేష‌న్లు ఫ్రీడ‌మ్ కోటా కింద ప‌రిగ‌ణించ‌డంతో విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల్లో తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని గ‌తంలో కూడా బంగ్లాదేశ్ యువ‌త ఉద్య‌మాన్ని లేవ‌నెత్తారు.

2018లో అన్ని ర‌కాల‌ రిజర్వేషన్లను రద్దు.. 

అయితే 2018 అక్టోబర్‌లో చ‌దువుకున్న యువ‌త‌ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. షేక్ హసీనా ప్రభుత్వం ఉద్యోగ అవ‌కాశాల్లో క‌ల్పిస్తున్న అన్ని ర‌కాల‌ రిజర్వేషన్లను రద్దు చేసింది. కేవ‌లం మెరిట్ బేసిస్ మీద‌నే ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని షేక్ హాసినా ఆదేశించారు. దీంతో ఆందోళ‌నకారులు వెన‌క్కి త‌గ్గారు. ఈ నిర్ణ‌యంతో 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో షేక్ హాసీనా మ‌ళ్లీ ఘ‌న విజ‌యం అందుకున్నారు.

2024 జూన్‌లో హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

అయితే రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయ‌డం అనేది రాజ్యాంగానికి విరుద్ధ‌మ‌ని కొంద‌రు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. విద్య ఉద్యోగ అవ‌కాశాల్లో 56 శాతం రిజ‌ర్వేష‌న్లు పునరుద్ధరించాలని 2024 జూన్‌లో హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 5 శాతం, మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

సుప్రీం కోర్టు తీర్పుతో బంగ్లాదేశ్‌లో మ‌ళ్లీ యువ‌త ఆందోళ‌న‌ల బాట

సుప్రీం కోర్టు తీర్పుతో బంగ్లాదేశ్‌లో మ‌ళ్లీ యువ‌త ఆందోళ‌న‌ల బాట ప‌ట్టింది. రోడ్ల‌పైకి వ‌చ్చారు. దేశ‌మంత‌టా నిరసనలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యాయి. యువ‌త ఆందోళ‌న‌ల‌పై బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్ర‌మంలో 300 మందికి పైగా యువ‌త మ‌ర‌ణించారు. దీంతో నాన్న తెచ్చిన రిజ‌ర్వేష‌న్లు ఒక వైపు, యువ‌త ఆందోళ‌న‌ల‌తో మ‌రో వైపు షేక్ హాసీనా తీవ్రంగా న‌లిగిపోయారు. చివ‌ర‌కు తండ్రి తెచ్చిన రిజ‌ర్వేష‌న్లు.. కూతుర్ని దేశం విడిచి పారిపోయేలా చేశాయి. తన 15ఏళ్ల సుదీర్ఘ పదవీకాలానికి తెరదించి, సైనిక విమానంలో దేశం విడిచి వెశ్లారు షేక్ హాసినా.

Exit mobile version