హెచ్ 1 బీ వీసా ధరఖాస్తులపై వార్షిక ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వీసాల ద్వారా ఎక్కువగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి రానుంది. విదేశాల్లో ఉన్న హెచ్ 1 బీ వీసా కలిగిన వారిని ఆయా కంపెనీలు అమెరికాకు రప్పిస్తున్నాయి. 24 గంటల్లోపుగా అమెరికాకు రావాలని కంపెనీలు ఆదేశించాయి.
విదేశాల్లో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను తమ దేశంలో ఉద్యోగంలో నియమించుకొనేందుకు 1990లో హెచ్ 1 బీ వీసాను అమెరికా ప్రవేశపెట్టింది. టెక్ కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసేందుకు ఈ వీసాలను జారీ చేస్తాయి. హెచ్ 1 బీ వీసా కలిగిన వారిలో ఇండియన్లే ఎక్కువ. 71 శాతం భారతీయులు హెచ్ 1 బీ వీసాలు పొందారు. ఆ తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. డ్రాగన్ కంట్రీ 11.7 శాతం వీసాలు దక్కించుకుంది. ఈ వీసా ఫీజును టెక్ కంపెనీలే భరిస్తాయి. అయితే ఇంత ఫీజును ఇప్పుడు టెక్ సంస్థలు భరించి ఇతర దేశాల నుంచి టెక్ నిపుణులను పిలిపించే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై టెక్ కంపెనీలు ఫోకస్ చేస్తాయి.
హెచ్ 1 బీ వీసాల వార్షిక రుసుమును అమెరికా భారీగా పెంచడంతో టెక్ కంపెనీలతో పాటు STEM ( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అమెరికా పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం 2023 ఆర్ధిక సంవత్సరంలో 3,86,318 హెచ్ 1 బీ వీసాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందులో 72 శాతం భారతీయులే. అంటే 2,78,000 మంది భారతీయులకు ఈ వీసాలు దక్కాయి. ఈ వీసాలు పొందిన వారిలో 65 శాతం మంది టెక్ నిపుణులే ఉన్నారు. అంటే 1,80,00 మంది టెక్కీలకు హెచ్ 1 బీ వీసా లభించింది. దేశంలోని 5.4 మిలియన్ల ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ (BPM) లో ప్రత్యక్షంగా 3.3 నుంచి 5.2 శాతం హెచ్ 1 బీ వీసా కార్డు కలిగిన వారు ఉన్నారని యూఎస్‌సీఐఎస్ నివేదిక చెబుతోంది. ఈ వీసా ఫీజు పెంచడంతో కొత్త వీసాల స్పాన్సర్స్ పై లేదా ప్రస్తుతం ఉన్న వీసాల పునరుద్దరణ విషయంలో కంపెనీలు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. స్థానికంగా ఉన్న వారిని నియమించుకోవచ్చు. ప్రత్యామ్నాయాలపై కంపెనీలు ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న భారతీయుల ఆశలపై ఈ వీసా ఛార్జీల పెంపు నీళ్లు చల్లింది. హెచ్ 1 బీ వీసా కలిగిన వారిలో ఎక్కువగా ఇండియన్లు ఉన్నారు. ఇందులో కొందరు తిరిగి స్వదేశాలకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరికొందరు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు పెట్టే ఛాన్స్ ఉంది. ఈ వీసాతో అమెరికాలో ఉండాల్సిన పరిస్థితులు వస్తే ఏడాదికి లక్ష డాలర్లు ఖర్చు పెట్టాలి. అమెరికాలో ఒక రేంజ్ భారతీయ ఇంజనీర్ ఏడాదికి 1,20,000 డాలర్లు సంపాదిస్తారని అంచనా. అంటే అందులో లక్ష డాలర్లు వీసా ఫీజు కిందే చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి. మాస్టర్స్ లేదా పీహెచ్ డీ పూర్తి చేసిన తర్వాత హెచ్ 1 బీ లకు మారే అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ నిర్ణయం వీరిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్ సీ ఎల్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు అమెరికన్ క్లయింట్ స్థానాల్లో వేలాది మంది ఇంజనీర్లకు హెచ్ 1 బీ వీసాలను ఇచ్చాయి. అయితే జూనియర్, మిడ్ లెవల్ సిబ్బందిని ఈ వీసా ద్వారా అమెరికాకు పంపడానికి టెక్ కంపెనీలు ఆలోచిస్తాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో టెక్ కంపెనీలు హెచ్ 1 బీ వీసాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నాయి. స్థానికంగా ఉన్నవారికే ఆఫర్లు ఇస్తున్నాయి. టెక్ కంపెనీల కంటే టెలికం కంపెనీలు వెరిజోన్, ఏటీఅండ్ టీ, సిటీ గ్రూప్, కేపిటల్ వన్ వంటి బ్యాంకులు హెచ్ 1 బీ వీసాలు ఎక్కువగా కలిగి ఉన్నాయని బ్లూమ్ బెర్గ్ ఇటీవల రిపోర్ట్ చేసింది. ఈ సంస్థలు ఇప్పుడు ఏం చేస్తాయనేది ప్రస్తుతం చర్చకు దారి తీసింది. భారతీయ ఐటీ సంస్థలు హెచ్ 1 బీ వీసాలను తగ్గిస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కంపెనీలు అమెరికాలో ఉంటున్న వారిలో 50 శాతం కంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. సబ్ కాంట్రాక్టింగ్, ఆఫ్ షోర్ డెలీవరీపై టెక్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. టీసీఎస్ సంస్థ ఉత్తర అమెరికా నుంచి సగం ఆదాయం సంపాదిస్తోంది. ఈ సంస్థ 50 శాతం ఉద్యోగులను స్థానికంగా ఉన్నవారినికే నియమించింది. ఇన్ఫోసిస్ కూడా 60 శాతానికి పైగా ఉద్యోగులను స్థానికంగా ఉన్నవారిని నియమించింది. హెచ్ సీ ఎల్, విప్రో వంటి సంస్థలు 80 శాతం స్థానికంగా నియమించుకున్నారు. హెచ్ సీ ఎల్ కు ప్రతి ఏటా 500 నుంచి 1000 మంది మాత్రమే హెచ్ 1 బీ వీసా ధరఖాస్తులు ఉంటాయి. టెక్ మహేంద్ర 30 శాతం మాత్రమే హెచ్ 1 బీ వీసాలపై ఆధారపడింది.