Site icon vidhaatha

Imran Khan | ‘నా భార్యకు ఏమైనా జరిగిందో’.. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ వార్నింగ్‌..!

Imran Khan : పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ‘నా భార్యకు ఏమైనా జరిగితే విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. తన భార్య బుష్రా బీబీ అరెస్టుకు ఆర్మీ చీఫ్‌ మునీరే కారణమని, ఈ విషయంలో ఆయన ప్రత్యక్ష జోక్యం ఉన్నదని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. ఆమె ప్రస్తుతం ఓ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇస్లామాబాద్‌ శివారులోని నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు.

బుష్రా బీబీకి శిక్ష విధించిన న్యాయమూర్తే తనతో మాట్లాడారని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. తీర్పు విషయంలో తనపై ఒత్తిడి ఉండేదని న్యాయమూర్తి చెప్పినట్లు వెల్లడించారు. ఒకవేళ తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని ఇమ్రాన్ హెచ్చరించారు. తాను బతికున్నంత వరకు మునీర్‌ను వదిలిపెట్టేది లేదని శపథం చేశారు. మునీర్‌ తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ, అక్రమ నిర్ణయాలను బహిర్గతం చేస్తానని అన్నారు.

‘దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఆ అడవికి రాజే అన్నీ నిర్ణయిస్తాడు. ఆయన కోరుకుంటే నవాజ్‌ షరీఫ్ నేరాలన్నింటినీ క్షమించేస్తారు. అలాగే మాకు ఐదు రోజుల్లో మూడు కేసుల్లో శిక్ష విధిస్తారు’ అని పరోక్షంగా మునీర్‌ను ఉద్దేశించి ఇమ్రాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్‌ రుణాల ద్వారా గాడినపడదని, పెట్టుబడుల ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం వస్తుందని అన్నారు.

దేశంలో చట్టం పటిష్ఠంగా అమలైనప్పుడే పెట్టుబడులు వస్తాయని, ఆటవిక రాజ్యం అమల్లో ఉన్నంత కాలం అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కాగా, ఇమ్రాన్‌ చేసిన ఆరోపణలపై పాకిస్థాన్‌ ఆర్మీ ఇప్పటివరకు స్పందించలేదు.

Exit mobile version