Emmanuel Macron | ట్రంప్‌తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్‌గ్లాసెస్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సన్‌గ్లాసెస్‌తో కనిపించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నెట్టింట చర్చకు దారి తీశారు. ట్రంప్‌తో వివాదం నడుస్తున్న వేళ ఈ లుక్ ఆసక్తికరంగా మారింది.

దావోస్‌ (Davos)లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సన్‌ గ్లాసెస్‌ ధరించి ఎంతో స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రపంచ వేదిక లోపల మాక్రాన్ సన్‌గ్లాసెస్ (Sunglasses) ధరించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump), మాక్రాన్‌ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆయన ఇలా సన్‌గ్లాసెస్‌తో సదస్సులో పాల్గొనడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

మాక్రాన్ సన్‌గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా డొనాల్డ్ ట్రంప్‌నకు ఏదైనా సందేశం ఇస్తున్నారా..? లేక ఇది కేవలం ఫ్యాషనా? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. సదస్సులో మాక్రాన్‌ సన్‌గ్లాసెస్‌తో ఉన్న ఫొటోలను నెటిజన్లు నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. అయితే, ఈ చర్చకు మాక్రాన్ స్వయంగా తెరదించారు. తనకు చిన్నపాటి కంటి సమస్య ఉందని, అందుకే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వచ్చిందని వివరించారు. కాగా, గత కొన్ని రోజుల కిందట ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సైతం మాక్రాన్‌ ఇలానే కళ్లద్దాలతో కనిపించారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ హెచ్చరికలకు మాక్రాన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సామ్రాజ్యవాదం మళ్లీ పురుడు పోసుకుంటోందంటూ అమెరికాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా చర్చకు దారి తీస్తున్నాయి.

ఫ్రాన్స్‌పై ట్రంప్‌ కన్నెర్ర..

మరోవైపు ఫ్రాన్స్‌పై ట్రంప్‌ కన్నెర్రజేసిన విషయం తెలిసిందే. గాజా (Gaza)లో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ (Board of Peace)లో చేరాలని ట్రంప్‌ చేసిన అభ్యర్థనను మాక్రాన్‌ తిరస్కరించారు. ఫ్రాన్స్‌ నిర్ణయం ట్రంప్‌ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఫ్రాన్స్‌పై టారిఫ్స్‌ బెదిరింపులకు దిగారు ట్రంప్‌. ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్‌లపై ఏకంగా 200 శాతం టారిఫ్ (Tariffs) విధిస్తానని హెచ్చరించారు. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) ఖచ్చితంగా దారికి వస్తాడని, బోర్డ్ ఆఫ్ పీస్ (Board of Peace) లో చేరుతాడని వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు ఆయన చేరాల్సిన అవసరం లేదు అంటూ తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది. ట్రంప్‌ బెదిరింపులు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఆందోళనను రేకెత్తించాయి.

అంతేకాదు గ్రీన్‌లాండ్‌కు సంబంధించిన మాక్రాన్‌ నుంచి తనకు వచ్చిన ఓ ప్రైవేట్‌ సందేశాన్ని కూడా ట్రంప్‌ ట్రూత్‌ పోస్టులో పంచుకున్నారు. ఇరాన్‌, సిరియా విషయంలో ఏకాభిప్రాయంలో ఉన్నట్లు ఆ సందేశంలో మాక్రాన్‌ స్పష్టం చేశారు. కానీ గ్రీన్‌లాండ్ విషయంలో మీరు (ట్రంప్‌ను ఉద్దేశించి) ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేద పేర్కొన్నారు. దావోస్‌లో సమావేశం అనంతరం పారిస్‌లో జీ7 సమావేశం ఏర్పాటుచేస్తానని మాక్రాన్‌ తెలిపారు. యూఎస్‌కు వెళ్లడానికి ముందు ఇద్దరం కలిసి డిన్నర్‌ చేద్దాం అంటూ ట్రంప్‌కు మాక్రాన్‌ మెసేజ్‌ పంపారు. ఆ ప్రైవేట్‌ మెసేజ్‌ను ట్రంప్‌ ట్రూత్‌లో పోస్టు చేశారు. ఇలా ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం వేళ ప్రపంచ వేదికపై మాక్రాన్‌ కళ్లద్దాలు ధరించడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Faria Abdullah | ఫరియా అబ్దుల్లా లవ్ స్టోరీపై హాట్ టాక్.. ఇంటర్వ్యూలో తొలిసారి ఓపెన్ అయిన హీరోయిన్
12 Lane Greenfield Expressway | ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?

Latest News