12 Lane Greenfield Expressway | ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?

ఫ్యూచర్ సిటీ టు మచిలీపట్నం: 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేతో తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా విప్లవం! 3 గంటల్లోనే అమరావతికి చేరవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ..

12 Lane Greenfield Expressway

భారత్ ఫ్యూచర్ సిటీ! తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. అమరావతి! ఆంధ్రుల కొత్త రాజధాని. ఈ రెండు ప్రాంతాల మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం జరగబోతున్నది. అయితే ఫ్యూచర్ సిటీ సమీపంలో డ్రై పోర్టును నిర్మించనున్న నేపథ్యంలో అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించారు. 12 లేన్లతో ప్రతిపాదించిన ఈ రోడ్డును పూర్తిగా కొత్త మార్గంలో అభివృద్ధి చేయనున్నారని తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరిగి, వాణిజ్య రవాణాకు గొప్ప ఊతం లభించనున్నది. తెలంగాణలోని 40 గ్రామాలు, ఏపీ పరిధిలోని 60 గ్రామాల మీదుగా అలైన్‌మెంట్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సచివాలయంలోని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది.

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల (భారత్ ఫ్యూచర్ సిటీ) దగ్గర్లోని తిప్పారెడ్డిపల్లికి సమీపంలో కుడి వైపు నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఇది అమరావతి పక్క నుంచి లంకెలపల్లి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు వెళ్లి ముగియనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో 118 కిలోమీటర్లు, ఏపీలో 180 కిలోమీటర్ల పొడవున రోడ్డు నర్మించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న జాతీయ రహదారికి కొత్తగా రానున్న గ్రీన్ ఫీల్డ్ హైవే సమాంతర రోడ్డు కానున్నది. నాలుగు లేన్లుగా ఉన్న ఈ రోడ్డుపై ప్రస్తుతం రద్దీ అధికంగా ఉంది. పండుగలు, పర్వదినాలు, సెలవుల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా వారం పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పెద్ద కుస్తీయే చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు మరో భారీ రోడ్డును ప్రతిపాదించారు.

తెలంగాణ రాష్ట్రానికి తీరప్రాంతం లేకపోవడం మైనస్‌గా మారింది. చమురు, ఎరువులు, సిమెంట్, స్టీలు, ధాన్యం వంటివి ఎగుమతులు, దిగుమతుల వ్యయం పెరగడంతో పాటు ప్రయాసగా మారింది. ఒక కోటికి పైగా జనాభా నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు విదేశాల నుంచి సరుకుల రవాణా ఖర్చుతో కూడుకున్నదిగా తయారైంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత సూర్యాపేట సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రై పోర్టు పై శ్రద్ధ పెట్టింది. ఫ్యూచర్ సిటీ వద్ద డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి మచిలీపట్నం పోర్టు, అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 12 లేన్ల రోడ్డుతో పాటు కొత్త రైలు మార్గం నిర్మాణం చేసేలా భూ సేకరణ చేయనున్నట్లు తెలిసింది. డ్రై పోర్టు రాకతో సరుకుల ఎగుమతులు, దిగుమతులు చవకగా చేసుకోవచ్చు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మచిలీపట్నం పోర్టులో సుమారు రూ.70వేల కోట్ల అంచనాతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మించనున్నది.

సుమారు మూడు వందల కిలోమీటర్ల పొడవు ఉన్న రోడ్డు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం కన్సల్టెన్సీ ఎంపిక చేయాలని ఇటీవలే నిర్ణయించారని సమాచారం. డీపీఆర్ రూపకల్పనకు రూ.15 కోట్ల వరకు అవుతుందని అంచనా. ఈ ప్రక్రియలో భాగంగా ట్రాఫిక్ సర్వే, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటలపై అధ్యయనం చేసి, పూర్తిస్థాయి డీపీఆర్‌ను రెడీ చేయనున్నారు. కన్సల్టెన్సీని ఎంపిక చేసి నివేదిక తెప్పించుకునేందుకు కనీసం ఆరు నుంచి పది నెలల సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రద్దీని బట్టి తొలుత ఆరు వరుసలు నిర్మాణం చేయాలా? లేదా ఎనిమిది వరుసలుగా అభివృద్ధి చేయాలా అనేదానిపై సర్వే నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 12 లేన్ల రోడ్డు నిర్మాణానికి ఒక్కో కిలోమీటరుకు రూ.40 కోట్ల చొప్పున మొత్తం ప్రాజెక్టుకు రూ.9వేల కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశముంటుందని అధికారుల ప్రాథమిక అంచనా.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి మూడు గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ తగ్గనున్నది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆయనకు గుర్తు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక టీమ్ ను పంపించాలని కోరగా, నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే యాచారం, మాల్, మర్రిగూడ, నాంపల్లి, గుర్రంపోడ్, వాడపల్లి, తంగెడ, కొత్తపాలెం, క్రోసూర్, పెద కూరపాడు, తాడికొండ, దుగ్గిరాల, కూచిపూడి గ్రామాల సమీపం నుంచి మచిలీపట్నం పోర్టుకు చేరుకొని ముగుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వే పూర్తయితే కానీ.. దీనిపై ఒక నిర్ధరాణకు రాలేమని అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే దక్షిణ తెలంగాణకు సరుకుల రవాణా చవకగా మారడంతో పాటు రియల్ ఎస్టేట్ ఊపందుకునే అవకాశముందని అంటున్నారు. అదే విధంగా సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా పురోగతి ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పోర్టు అనుసంధానం, పెట్రోకెమికల్ రిఫైనరీ ఏర్పాటు, రియల్ ఎస్టేట్, సరుకుల రవాణా మూలంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.

ఇవి కూడా చదవండి :

Bengaluru Theft | ఆ దొంగ టార్గెట్‌ మహిళల లోదుస్తులే.. వాటితో ఏం చేసేవాడంటే..?
Sunita Williams | అంతరిక్ష ప్రయాణానికి గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్‌.. ఆమె ప్రయాణం ఓ అద్భుతం.. సాహసం!

Latest News