న్యూఢిల్లీ : పాకిస్తాన్ మాజీ ప్రధాని(Pakistan former PM) ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మృతి వార్తలు సంచలనం రేపాయి. ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మృతి చెందారంటూ పెద్దఎత్తున ప్రచారం చోటుచేసుకుంది. ఆయనను ఐఎస్ఐ మద్దతుదారులు జైలులో హత్య చేశారన్న ప్రచారం కలకలం రేపింది. అయితే రావల్పిండి అడియాలా జైలు అధికారులు ఆ వార్తలను కొట్టిపారేశారు. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని..ఆయన మంచిఆరోగ్యంతో ఉన్నారని, మంచి భోజనం అందిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైలు నుంచి తరలించారన్న వార్తల్లో నిజం లేదని, ఆయనకు జైలులో మంచి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలను ఖండించారు. ఇమ్రాన్ బయట కంటే జైలులో సౌకర్యవంతంగా ఉన్నారని.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో కూడా లభించని మంచి ఆహారాన్ని ఆయన పొందుతున్నారని పేర్కొన్నారు. ఆయనకు జైలులో విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ 2023ఆగస్టు నుంచి అడియాలా జైలులోఉన్నారు. తాజాగా బలూచిస్థాన్ విదేశాంగ శాఖ ఇమ్రాన్ మృతి చెందారని తెలుస్తుందంటూ ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఆయన అభిమానుల్లో కలవరం రేపింది. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్, నిఘా విభాగం ఐఎస్‌ఐ కలిసి ఆయన్ని జైలులో హతమార్చినట్లు తెలుస్తుందని ఆ పోస్టులో పేర్కొంది. అటు మీడియా వర్గాల్లోనూ ఇమ్రాన్ మరణించారన్న వార్త కథనాలు వెలువడటంతో ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ఇమ్రాన్ సోదరీమణులతో కలిసి మద్దతదారులు జైలు వద్దకు వెళ్లి ఇమ్రాన్ ను చూపించాలంటూ డిమాండ్ చేశారు. అయితే జైలు అధికారులు వారిని ఇమ్రాన్ ను చూసేందుకు అనుమతించకపోవడంతో ఇమ్రాన్ క్షేమ సమాచారాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ క్షేమంగా ఉన్నారంటూ ప్రకటించడంతో తాత్కాలిక వివాదం సద్దుమణిగింది.
