Hyderabad KBR Park Signal-Free Corridor: GHMC to Build 6 Flyovers & 6 Underpasses with ₹1,090 Crore Budget
సారాంశం
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ రూ.1090 కోట్లతో 6 ఫ్లైఓవర్లు, 6 అండర్‌పాస్‌ల నిర్మాణానికి సిద్ధమైంది. సాయిల్ టెస్టులు తుది దశలో ఉండగా, వచ్చే నెల నుంచే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. టీడీఆర్ పరిహారం వల్ల భూసేకరణ సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి.
విధాత సిటీ డెస్క్ | హైదరాబాద్:
KBR Park Signal-Free | కేబీఆర్ హైదరాబాద్ కేబీఆర్ పార్క్ ప్రాంతం… నగరంలో అత్యంత రద్దీగా మారిన జంక్షన్లలో ఇదొకటి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, 12, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, అగ్రసేన్జంక్షన్, మాసాబ్ ట్యాంక్ వైపు వెళ్లే మార్గాల్లో ఉదయం–సాయంత్రం ఆఫీస్ టైమ్‌ల్లో వాహనాలు గంటల తరబడి నత్తల్లా నడవడం ఇక్కడ ప్రతీరోజు మామూలు దృశ్యం. ఈ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. దాని భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్లు, 6 అండర్పాస్లు, మొత్తం రూ.1090 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ప్రాజెక్ట్ హెచ్–సిటీ (Hyderabad City Innovative and Transformative Infrastructure) కింద అమలు కానుంది. నిర్మాణం పూర్తైతే ఈ ప్రాంతం మొత్తాన్ని సిగ్నల్–ఫ్రీ కారిడార్గా మారుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. దీంతో బంజారా హిల్స్ రోడ్ల నుండి ఐటీ కారిడార్ వైపు — మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణం గణనీయంగా సులభం కానుంది. ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ నరకం చూపిస్తుంటుంది.
ఈ ప్రాజెక్ట్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) అనుమతి లభించడం కీలక ముందడుగు. ఏడాది క్రితమే భూగర్భ పరీక్షలు ప్రారంభించినప్పటికీ భూసేకరణ సమస్యల వల్ల పనులు ముందుకు కదల్లేదు. అయితే తాజా చర్చల్లో బల్దియా… ప్రాజెక్టులో ఆస్తులు కోల్పోతున్న వారికి టీడీఆర్ (Transferable Development Rights) ద్వారా పరిహారం అందిస్తామని హామీ ఇవ్వడంతో అడ్డంకులు తొలగిపోయాయి. నగదు కోరితే అక్కడి మార్కెట్ విలువకు రెండు రెట్లు, టీడీఆర్ కోరితే నాలుగు రెట్లు పరిహారం అందించనున్నట్లు అధికారులు స్పష్టం చేసారు.
మట్టి పరీక్షలు తుది దశకు – వచ్చే నెల నుంచే నిర్మాణ పనులు
ప్రస్తుతం ప్రాజెక్ట్ సైట్‌లో భూధృడత్వ పరీక్షలు తుది దశలో ఉన్నాయి. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ గుణాలు, మట్టి దృఢత్వం, నీటి మట్టం వంటి అంశాలను ఖచ్చితంగా పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా ఫ్లైఓవర్ల డిజైన్, పిల్లర్ల ఎత్తు, నిర్మాణ పద్ధతి ఖరారు చేయనున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, మరో రెండు రోజుల్లో ఈ పరీక్షలు ముగియనున్నాయి.
కేబీఆర్ పార్క్ పర్యావరణపరంగా సున్నితప్రాంతం కావడంతో, పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చెట్ల తొలగింపును తగ్గించేలా రోడ్ల అలైన్‌మెంట్‌ను సవరించడం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా విభజించడం వంటి చర్యలను GHMC అమలు చేయనుంది.
ఆఫీస్ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్మాణ పనులను రద్దీ ఉండని సమయాల్లో చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వాహనాలకు తాత్కాలిక మార్గాలు, దారిమళ్లింపులు ముందస్తుగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తికాగానే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడమే కాకుండా, నగర ఐటీ కారిడార్‌కి మరింత వేగవంతమైన అనుసంధానం లభించనుంది. పర్యావరణహితంగా, విస్తృత ప్రణాళికతో రూపొందిన ఈ మౌలికవసతుల ప్రాజెక్టు నగర రహదారి అభివృద్ధిలో కీలక మలుపు కానుంది.
కేబీఆర్ పార్క్ సిగ్నల్-ఫ్రీ కారిడార్ నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ పశ్చిమ మండలంలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. రెండు సంవత్సరాల వ్యవధిలో పనులు పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్ట్, నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది.
