Dancing Daffodils Tower | ఘట్‌కేసర్​లో హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’ టవర్‌ ప్రాజెక్ట్.. రూపుదాల్చేనా?

ఘట్‌కేసర్‌లో 72 అంతస్తుల ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’ రెసిడెన్షియల్ టవర్ ప్రతిపాదన చర్చనీయాంశమైంది. 244.6 మీటర్ల ఎత్తుతో హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్‌గా ప్రచారం జరుగుతున్నా, లొకేషన్, మార్కెట్ డిమాండ్‌పై పెట్టుబడిదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ప్రతిపాదిత 72 అంతస్తుల డ్యాన్సింగ్ డాఫోడిల్స్ టవర్ రూపకల్పన

Will Ghatkesar Really Host Hyderabad’s Tallest Residential Tower? Big Questions Around ‘Dancing Daffodils’

Dancing Daffodils Tower | తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ వేగంగా విస్తరిస్తోంది. ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో వృద్ధితో నగర పరిధి విస్తరిస్తున్న వేళ, కొత్తగా తూర్పు హైదరాబాద్‌ వైపు ఘట్‌కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్ ప్రతిపాదన చర్చనీయాంశమైంది. ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’ పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్​లో 3 భవనాలు ఉండగా, అత్యంత ఎత్తైనది 72 అంతస్థులతో ‘ట్రంపెట్’ కాగా, మరో రెండు ‘ఆంథర్’​, ‘ఓవరీ’లు.. 65 ఫ్లోర్లతో రానున్నాయి.​ మాలిశెట్టి ఇంజనీరింగ్​ కన్​స్ట్రక్షన్స్​ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.

అనుమతులు మంజూరు : నిర్మాణ ప్రారంభం ఎప్పుడు?

డ్యాన్సింగ్ డాఫోడిల్స్ ‘ట్రంపెట్’​ టవర్​ ప్రతిపాదిత ఎత్తు సుమారు 244.6 మీటర్లు. ప్రాథమిక అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు కంపెనీ తెలిపింది. తాత్కాలిక నిరభ్యంతర పత్రాలు కూడా జారీ అయ్యాయి. అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ విక్రమ్‌సింగ్‌మాన్‌ ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో ధృవీకరించారు. ఇలాంటి భవనాలలో అగ్నిప్రమాదాలను నియంత్రించడానికి కావాల్సిన అధునాతన పరికరాలు సైతం కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.  ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన నివాస భవనం SAS Crown కోకాపేట ప్రాంతంలో 57 అంతస్తులతో ఉన్న నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్ట్ హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన టవర్‌గా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కాగా, నిర్మాణపనులను సంస్థ మాలిశెట్టి ఇంజనీరింగ్​ త్వరలోనే మొదలుపెట్టనుందని తెలుస్తోంది. కాగా, హెచ్​ఎండీఏ అనుమతులు రావాల్సిఉంది.

966 అపార్ట్‌మెంట్లు.. నిర్మాణ ప్రాంతంపై పెట్టుబడిదారుల సందేహాలు

ఈ ప్రాజెక్టులో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు 692, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు 274 కలిపి మొత్తం 966 యూనిట్లు ప్రతిపాదించారు. మెలికలు తిరిగినట్లుండే ఆకర్షణీయమైన డిజైన్‌తో నిర్మించనున్నట్లు వెల్లడించారు. అయితే రియల్ ఎస్టేట్ నిపుణులు, పెట్టుబడిదారుల్లో కొంత సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్ట్ స్థలం ఇంజినీరింగ్ కళాశాల, రైల్వే ట్రాక్ సమీపంలో ఉండటం, తూర్పు హైదరాబాద్‌లో ప్రీమియం హై-రైజ్ మార్కెట్ ఇప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. గతంలో భారీ హైప్‌తో ప్రకటించిన కొన్ని ప్రాజెక్టులు అనుకున్న వేగంతో పూర్తి కాకపోవడం కూడా ఈ సందేహాలకు దారితీస్తోంది. భారీ స్థాయిలో యూనిట్లు ఉండటంతో మార్కెట్ ఆబ్జార్ప్షన్ ఎలా ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గత అనుభవాల ప్రభావం.. పరిమాణం తగ్గే అవకాశముందా?

హైదరాబాద్‌లో గతంలో 100 అంతస్తుల టవర్‌గా ప్రకటించి తర్వాత అనుమతుల సమస్యలతో రెండు 50 అంతస్తుల టవర్లుగా మార్చిన ఉదాహరణలు ఉన్నాయి. అలాగే తూర్పు హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్‌షిప్ వంటి భారీ ప్రాజెక్టులు ప్రారంభ ఉత్సాహం తర్వాత మందగించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత 72 అంతస్తుల ప్రతిపాదన కూడా భవిష్యత్తులో పరిమాణం తగ్గే అవకాశముందా? అన్న చర్చ సాగుతోంది. అయితే నగర విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి తూర్పు హైదరాబాద్‌కు దీర్ఘకాలికంగా లాభం చేకూర్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అనుమతులు, మార్కెట్ డిమాండ్, ధరల వ్యూహం ఆధారంగానే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు స్పష్టమవుతుందని నిపుణులు అంటున్నారు.

Latest News