తారస్థాయికి ఇజ్రాయెల్ – హ‌మాస్ పోరు… 1100కి చేరిన మృతుల సంఖ్య‌

  • Publish Date - October 9, 2023 / 08:10 AM IST

  • గాజాపై విరుచుకుప‌డుతున్న ఇజ్రాయెల్‌
  • యువ‌తుల‌ను అప‌హ‌రించి అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్న హ‌మాస్ స‌భ్యులు
  • పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్ర‌మాదం


విధాత‌: ఇజ్రాయెల్‌, హమాస్ ద‌ళాల మ‌ధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. హిజ్‌బుల్లా, ఇస్లామిక్ జిహాద్ త‌దిత‌ర ఉగ్రవాద సంస్థ‌లు కూడా రంగంలోకి దిగ‌డంతో ప‌రిస్థితులు అదుపుత‌ప్పేలా క‌నిపిస్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఇరువైపులా క‌నీసం 1100 మంది సామాన్య పౌరులు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. వీరిలో 700 మంది ఇజ్రాయేలీలు కాగా మిగిలిన వారు పాల‌స్తీనా పౌరులు. యుద్ధంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు న‌మోదైన 1973 రికార్డును ఈ యుద్ధం తిర‌గ‌రాసింది.


అప్పుడు జ‌రిగిన ఇజ్రాయెల్‌కు అర‌బ్ దేశాల‌కు మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో 413 మంది ప్రాణాలు కోల్పోగా ఆ సంఖ్య‌ను ఈ యుద్ధం అధిగ‌మించింది. పోరు ప్రారంభ‌మైన సోమ‌వారంతో మూడు రోజులైన నేప‌థ్యంలో ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా లేదా అని నిపుణులు ప‌రిశీలిస్తున్నారు. దీర్ఘ‌కాల పోరాటానికి ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహు పిలుపునివ్వ‌గా.. గాజాను స్వాధీనం చేసుకునే వ‌ర‌కు త‌మ పోరు కొన‌సాగుతుంద‌ని ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి స్ప‌ష్టం చేశారు.


మ‌రోవైపు ఇజ్రాయెల్‌లోని ఎడారి ప్రాంతంలో నిర్వ‌హించిన ఒక సంగీత వేడుక‌పై శ‌నివారం ఉద‌యం హ‌మాస్ మూక‌లు రాక్ష‌స మూక‌ల్లా విరుచుకుప‌డిన ఉదంతం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. అక్క‌డ దొరికిన వారిని దొరికిన‌ట్లుగా పిట్ట‌ల్ని కాల్చిన‌ట్లు కాల్చేశారు. కొంత మంది యువ‌తుల‌ను బంధీలుగా తీసుకున్నారు. నోవా అనే యువ‌తి వేడుకుంటున్నా బండికి క‌ట్టి తీసుకెళ్లిపోయిన వీడియో ఆదివారం వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.


మ‌రికొంత మంది తొక్కిస‌లాట‌లో చ‌నిపోయారు. పేలుళ్లు జ‌రిగిన అనంత‌రం.. ప్రేక్ష‌కులు అంద‌రూ బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఊహించిన హ‌మాస్ ఉగ్ర‌వాదులు అక్క‌డ మాటు వేసి విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. కొంత మంది తెలివిగా చ‌నిపోయిన‌ట్లు న‌టించి త‌మ ప్రాణాలు కాపాడుకున్నారు. సోమ‌వారం అక్క‌డ‌కు చేరుకున్న ఇజ్రాయెల్ ద‌ళాలు కొంత‌మందిని ర‌క్షించాయి. మ‌రోవైపు హ‌మాస్ ద‌ళాల వ‌ద్ద క‌నీసం 100 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో అత్యున్న‌త ర్యాంకు సైనికులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.


మ‌రొక ఇస్లామిక్ ఉగ్ర‌వాద సంస్థ అయిన ఇస్లామిక్ జిహాద్ త‌మ వ‌ద్ద 30 మంది బందీలుగా ఉన్నార‌ని ప్ర‌క‌టించింది. ఇలా అప‌హ‌రించిన వారిలో యువ‌తుల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, యువ‌కుల‌ను కాల్చి ప‌డేస్తున్నార‌ని స్థానిక సంస్థ‌లు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక ద‌ళం విరుచుకుప‌డుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ బాంబుల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో అక్క‌డ భారీ ఆస్తి న‌ష్టం, ప్రాణ న‌ష్టం సంభవిస్తున్నాయి. మిత్ర దేశానికి అండ‌గా ఉండ‌టానికి అమెరికా నేవీ ఒక ఫ్లీట్‌ను మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రానికి పంపుతోంది.

Latest News