జ‌పాన్ ప్ర‌జ‌ల‌పై ప‌గ‌బ‌ట్టిన భ‌ల్లూకాలు.. పెరుగుతున్న దాడులు

  • Publish Date - October 30, 2023 / 08:49 AM IST

జ‌పాన్ (Japan) ప్ర‌జ‌ల‌కు కొన్ని రోజులుగా ఒక కొత్త భయం పుట్టుకొచ్చింది. మ‌రీ ముఖ్యంగా అటవీ ప్రాంతాల ప‌క్క‌నుండే గ్రామాలు, ప‌ట్ట‌ణాల ప్ర‌జ‌లు ఎక్కువ ఆందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. వారి భ‌యానికి కార‌ణం ఎలుగుబంట్లు. ఈ ఏడాది వాటి దాడులు (Bear Attacks) గ‌తంలో ఎన్న‌డూ లేనంత స్థాయిలో జ‌రుగుతుండ‌టంతో ప్రాణాలు అర‌చేత ప‌ట్టుకుని తిరుగుగున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ‌మ‌నిస్తే ఎలుగుబంటి దాడి ఘ‌ట‌న‌లు 158 న‌మోద‌య్యాయి. వీరిలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు ఎక్కువ‌గా జ‌పాన్‌లోని ప్ర‌ధాన ద్వీప‌మైన హోన్షూలో జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.


ఈ దాడుల‌కు ప్ర‌ధాన కార‌ణం.. ఎలుగుబంట్ల సంఖ్య‌కు అనుగుణంగా అడవిలో ఆహారం దొర‌క‌క‌పోవ‌డ‌మేన‌ని ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు పేర్కొంటున్నారు. గ‌త ఏడాది ప‌ళ్ల తోట‌లు, బీచ్‌న‌ట్‌ల తోట‌ల సాగు పెర‌గ‌డంతో ఎలుగుబంట్లకు ఆహారం పెద్ద ఎత్తున ల‌భించింది. దీంతో వాటి సంతాన‌మూ వృద్ధి చెందింది. కానీ ఈ ఏడాది వాటి సంఖ్య‌కు స‌రిప‌డా ఆహారం ల‌భించ‌డం లేదు. ఎలుగుబంట్లు నిద్రాణ స్థితిలోకి వెళ్లేముందు పెద్ద ఎత్తున ఆహారాన్ని తీసుకుంటాయి. అంత మొత్తంలో తిండి లభించ‌క‌పోవ‌డంతో అవి ఆగ్ర‌హానికి గుర‌వుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.


గ‌తంలో ఎలుగుబంటి దాడులు అట‌వీ ప్రాంతాల్లో.. అదీ హైకింగ్‌కు వెళ్లే వారిపైనే జ‌రిగేవ‌ని.. ఇప్పుడు జ‌నావాసాల్లోనే జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. గ్రామాల‌కు, అట‌వీ ప్రాంతాల‌కు మ‌ధ్య ఉండే బ‌ఫ‌ర్ జోన్ త‌రిగిపోవ‌డం కూడా దీనికి కార‌ణ‌మ‌ని గార్డియ‌న్ ప‌త్రిక వెల్ల‌డించింది. భ‌ల్లూకాల‌ దాడికి గురైన వారిలో స‌గం మంది వాటిని బెదిరించ‌డానికి ఉప‌యోగించే గంట‌లు తీసుకునే వెళ్లార‌ని అయినా.. దాడి జ‌రిగింద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల మొద‌ట్లోనే అకితా అనే ప‌ట్ట‌ణంలో ఒకే రోజు ఆరుగురిపై ఎలుగుబంట్ల దాడి జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఒకరు వృద్ధురాలు కాగా.. బాలిక పాఠ‌శాల బ‌స్సుకోసం ఎదురు చూస్తూ ఉండ‌గా భ‌ల్లూక దాడికి గుర‌య్యారు.


ఈ ఆరు దాడులూ దుకాణాల ద‌గ్గ‌ర, నివాస స‌ముదాయాల వ‌ద్ద‌, ఆసుప‌త్రుల వంటి జ‌న‌స‌మ్మ‌ర్థ ప్రాంతాల్లోనే జ‌రిగడం.. ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దాడుల‌ను నియంత్రించ‌డానికి కొన్ని సూచ‌న‌లు జారీ చేసింది. ఆహార వ్య‌ర్థాల‌ను, ప‌ళ్లు, ఇత‌ర వ్య‌ర్థాల‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేయొద్ద‌ని సూచించింది. త‌లుపులను ఎప్పుడూ గ‌డియ‌పెట్టి ఉంచుకోవాల‌ని, పొలాల్లో కింద ప‌డిన పండ్ల‌ను రైతులు ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించేయాల‌ని సూచించింది. అంద‌రూ బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు ఎలుగుబంట్ల‌ను భ‌య‌పెట్టే గంట‌లు, ద‌గ్గ‌రికొస్తే వాటిపై కొట్ట‌డానికి స్ప్రే ద‌గ్గ‌ర ఉంచుకోవాల‌ని తెలిపింది. అవి ఎదురుప‌డిన‌పుడు క‌ళ్ల‌లోకి క‌ళ్లుపెట్టి చూడొద్ద‌ని, వాటి నుంచి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించొద్ద‌ని సూచించింది.

Latest News