విధాత : అదేమి ప్రఖ్యాత చిత్రకారుడి పెయింటింగ్ కాదు..గ్రాఫిక్స్ మాయ అసలే కాదు. ప్రకృతి దిద్దిన హరివిల్లు రంగుల సజీవ చిత్రం అది. జపాన్ లోని గిఫు ప్రిఫెక్చర్‌లోని మోనెట్స్ చెరువులోని సుందర దృశ్యాలు ప్రకృతిలోని రమణీయతకు అద్దం పడుతూ చూపరులను..నెటిజన్లను అబ్బుర పరుస్తుంది. ఓ తెలుగు సినిమాలో దేవకన్య ఇంద్రజ..దివి నుంచి భువికి దిగివచ్చి హిమగిరుల సొగసులకు పరవశించి..అందాలలో ఆహో మహోదయం..భూలోకమే నవోదయం అంటూ పాడిన పాటకు ప్రతిరూపంగా మోనెట్స్ చెరువు కనువిందు చేస్తుంది.
కదలాడే రంగుల చేపలు, రకరకాల వర్ణాల ఆకులు, మొక్కలు..రంగుల పూలు..కలువలు, నీటిలోని ప్రతి జీవి, మొక్క, చివరకు అడుగు భాగం కనిపించే(క్రిస్టల్ క్లియర్) స్వచ్చమైన నీటితో కనువిందు చేస్తున్న చెరువు సుందర దృశ్యం చూడటానికి రెండు కళ్లు చాలవు. సూర్యకాంతితో చెరువులోని ఆ ద్యశ్యాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఈ చెరువులోని సుందర దృశ్యాలను చూసిన వారు నిజంగానే ఇదంతా ప్రఖ్యాత ప్రకృతి అందాల చిత్రకారుడు క్లాడ్ మోనెట్ గీసిన రంగుల ప్రకృతి చిత్రాలను తలపిస్తున్నాయంటున్నారు.
చిత్రకారుడు క్లాడ్ మోనెట్ 1896 నుండి 1926 వరకు తన గివర్నీ తోటలో చిత్రించిన వాటర్ లిల్లీ సిరీస్ చిత్రాలకు దగ్గరగా మోనెట్ చెరువు అందాలు ఉన్నాయని, క్రిస్టల్ క్లియర్ గా కనిపించే టర్కోయిస్ నీరు, వికసించే నీటి కలువలు, కదలాడే రంగుల కోయి చేపల దృశ్యాలు అచ్చం అలాగే ఉన్నాయంటున్నారు. మోనెట్ చెరువు సుందర దృశ్యం వీడియోలో చెరువుపై నెమ్మదిగా సాగుతున్న పొగమంచు. శక్తివంతమైన గులాబీ కమలాలు, ఆకుపచ్చ ఆకులు, వంపు వంతెనలు ,నారింజ-తెలుపు కోయి చేపలు… నిజంగా చిత్రకారుడు క్లాడ్ మోనెట్ ఇంప్రెషనిస్ట్ చిత్రకళకు అద్దం పడుతున్నాయని అభివర్ణిస్తున్నారు.
Monet’s Pond in Japan looks like a real-life Monet paintingpic.twitter.com/vzvAngxS1i
— James Lucas (@JamesLucasIT) November 10, 2025
