టీచ‌ర్‌ను కాల్చిన ఆరేండ్ల బాలుడు.. అత‌డి త‌ల్లికి 21 నెల‌లు జైలు

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో తరగతి గ‌దిలో పాఠాలు బోధిస్తున్న టీచ‌ర్‌ను తుపాకీతో కాల్చిన‌ కేసులో ఆరేండ్ల బాలుడి తల్లికి బుధవారం 21 నెలల జైలు శిక్ష పడింది

  • Publish Date - November 16, 2023 / 10:34 AM IST
  • అమెరికాలోని వర్జీనియాలో ఘ‌ట‌న‌
  • తాజాగా తీర్పు వెల్ల‌డించిన న్యాయ‌స్థానం


విధాత‌: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో తరగతి గ‌దిలో పాఠాలు బోధిస్తున్న టీచ‌ర్‌ను తుపాకీతో కాల్చిన‌ కేసులో ఆరేండ్ల బాలుడి తల్లికి బుధవారం 21 నెలల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది జనవరి 6న ఈ కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఆరేండ్ల బాలుడు కావాలనే టీచర్‌పై కాల్పులు జరిపాడని పోలీస్‌శాఖ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం… ఆరేండ్ల బాలుడి త‌ల్లి 26 ఏండ్ల డేజా టేలర్‌కు తుపాకీ ఉన్న‌ది. ఆమెకు మాదకద్రవ్యాలు వాడే అల‌వాటు కూడా ఉన్న‌ది. గంజాయి తాగే అల‌వాటు ఉన్న డేజా టేల‌ర్‌ తుపాకీని ఇంట్లో నిర్ల‌క్ష్యంగా పెట్ట‌డంతో ఆమె ఆరేండ్ల కుమారుడు దానిని స్కూల్‌కు తీసుకెళ్లి టీచ‌ర్ అబ్బి జ్వెర్నర్‌పై కాల్పులు జ‌రిపాడు. అమె చేతితోపాటు చెస్ట్‌లోనూ బుల్లెట్ గాయాల‌య్యాయి. హుటాహుటిన ఆమెను స్కూల్ ఇబ్బంది ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.


అనేక చికిత్సల అనంత‌రం బాధితురాలు ఆర్థికంగా, శారీర‌కంగా కూడా న‌ష్ట‌పోయింది. బాధితురాలు 40 మిలియన్‌ డాలర్లు పరిహారం చెల్లించాలని కేసు పెట్టింది. కాల్పులు కార‌ణంగా బాధితురాలికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర న‌ష్ట జ‌రిగింద‌ని టీచ‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు.


షూటింగ్‌లో ఉపయోగించిన తుపాకీని జూలై 2022లో టేలర్ కొనుగోలు చేశారని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. కేసును విచారించిన కోర్టు బాలుడి తల్లికి బుధవారం 21 నెలల జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువ‌డిన సంద‌ర్భంలో బాలుడి త‌ల్లి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.