Site icon vidhaatha

Muhammad Yunus | దేశ ప్రజల భద్రతే తొలి లక్ష్యం: బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్‌ యూనస్‌

ఢాకా : దేశ ప్రజలకు భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని బంగ్లాదేశ్‌ ప్రధాని హోదాతో సమానమైన ప్రధాన సలహాదారుగా (equivalent to prime minister) నియమితులైన మహ్మద్‌ యూనస్‌ (Nobel laureate Muhammad Yunus) చెప్పారు. బంగ్లదేశ్‌ పునర్నిర్మాణంలో తనకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పారిస్‌ నుంచి ఆయన గురువారం దుబాయ్‌ మీదుగా బంగ్లాదేశ్‌ చేరుకున్నారు.

హజ్రత్‌ షాజలాల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో (Hazrat Shahjalal International Airport) స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఆయన దిగారు. ఆయనకు ఆర్మీ చీఫ్‌ వాకెర్‌ ఉజ్‌ జమా (Army chief General Waker-Uz-Zaman), సీనియర్‌ అధికారులు, విద్యార్థి నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు వద్దే ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

హసీనా ప్రభుత్వంపై ఉద్యమంలో విజయం సాధించిన విద్యార్థులు, యువతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు మనందరికీ గర్వకారణమైన రోజని అన్నారు. దేశంలో ప్రభుత్వ మార్పును రెండో స్వాతంత్ర్యోద్యమంగా యూనస్‌ అభివర్ణించారు. ‘మనం రెండోసారి స్వాతంత్ర్యాన్ని పొందాం. ఈ స్వాతంత్ర్యాన్ని మనం రక్షించుకోవాలి (protect this independence)’ అని పిలుపునిచ్చారు.

శాంతిభద్రతలను పూర్వ స్థితికి తేవడం, అరాచక కార్యకలాపాలను, మైనార్టీలపై దాడులను నియంత్రించడం తన తొలి లక్ష్యమని యూనస్‌ చెప్పారు. దేశంలో కొనసాగుతున్న అల్లర్లు కుట్రలో భాగమని చెప్పారు. ‘దేశ ప్రజలందరికీ భద్రతను కల్పించే ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం’ అని ఆయన అన్నారు.

నిరసనల సమయంలో తలెత్తిన గందరగోళ పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పారు. ‘నా మీద నమ్మకం ఉంటే.. మీరు దేశంలో ఏ ప్రాంతంలోనూ ఎవరిపైనా దాడులు చేయరు. ఇది మన తొలి బాధ్యత’ అన్నారు. ‘మీరు అది చేయలేకపోయినా, నా మీట వినకపోయినా ఇక్కడ నేను చేయడానికి ఏమీ లేదు’ అని స్పష్టం చేశారు.

ఈ దేశం ఇప్పుడు యువత (young people) చేతిలోనే ఉన్నదని యూనస్‌ అన్నారు. దీనిని తమ ఆకాక్షంలకు (aspirations) అనుగుణంగా పునర్నిర్మించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. అందుకోసం యువత వారికి ఉన్న తెలివితేటలను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ దేశానికి మీరే స్వాతంత్ర్యం తెచ్చారని అన్నారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన తొలి అమరుడు అబు సయీద్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయనకు నివాళులర్పించారు.

Exit mobile version