సైక్ వైపు నాసా చూపు.. తొలిసారి లోహాల ప్ర‌పంచంపై ప‌రిశోధ‌న‌కు ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం

  • Publish Date - October 14, 2023 / 10:14 AM IST

విధాత‌: అరుదైన లోహాల‌తో నిండిన ఒక గ్ర‌హ శక‌లాన్ని అధ్య‌య‌నం చేసేందుకు నాసా (NASA) ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించింది. సైక్ అనే ఉప‌గ్ర‌హాన్ని తీసుకుని ఫాల్క‌న్ అంత‌రిక్ష నౌక శుక్ర‌వారం నింగిలోకి దూసుకెళ్లింది, అమెరికాలోని ఫ్లోరిడా అంత‌రిక్ష కేంద్రం నుంచి ఈ ప్ర‌యోగం జ‌రిగిన‌ట్లు నాసా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ప‌రిశోధ‌న కోసం నాసా తొలిసారి ఎలాన్ మ‌స్క్‌కు స్పేస్ ఎక్స్ రాకెట్‌ను ఉప‌యోగించింది. నాసా ప‌రిశోధించ‌నున్న ఆస్ట‌రాయిడ్ పేరు సైక్ (Psyche Asteroid) కావ‌డంతో ఉప‌గ్ర‌హానికీ అదే పేరు పెట్టారు.


ఒక చిన్న వ్యాన్ అంత ఉండే ఈ భారీ ఉప‌గ్ర‌హం.. విశ్వంలో 360 కోట్ల కి.మీ. ప్ర‌యాణించ‌నుంది. 2029 ఆగ‌స్టు నాటికి ఇది ల‌క్ష్యాన్ని చేరుకుంటుంద‌ని నాసా భావిస్తోంది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన గంట త‌ర్వాత ఉప‌గ్ర‌హం రాకెట్ నుంచి విడిపోయి త‌న ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టింది. ప్ర‌స్తుతం ఉన్న దిశ‌లోనే అది నాలుగైదు నెల‌లు ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని.. త‌ర్వాత దాని దిశ‌ను మారుస్తామ‌ని నాసా తెలిపింది. ఈ మిష‌న్ కోసం నాసా తొలిసారి సోలార్ ఎల‌క్ట్రిక్ అయాన్ థ్ర‌స్ట‌ర్స్‌ను ఉప‌యోగించింది.


సైక్ ద‌గ్గ‌ర‌కు ఇప్పుడెందుకు?


సైక్ అనేది గ్ర‌హ శ‌కలం అనుకుంటున్న‌ప్ప‌టికీ అది ఒక మ‌రుగుజ్జు గ్ర‌హం అని శాస్త్రవేత్త‌లు భావిస్తున్నారు. అది గ్ర‌హంగా ఏర్ప‌డుతున్న స‌మయంలో ఏదో ఒక భారీ వ‌స్తువు సైక్ ని తాకింది. దీంతో దాని పై ఉప‌రిత‌లం మొత్తం ఎగిరిపోయి.. అంత‌ర్భాగం ఒక‌టే మిగిలింది. సైక్‌ను భూమిపై ఉన్న భారీ టెలిస్కోపుల‌తో ప‌రిశీలించిన శాస్త్రవేత్త‌లు దీనిని ప‌రిశోధించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.


ఎందుకంటే మ‌న‌కు అంత‌రిక్షం గురించి తెలిసిన దాంతో పోలిస్తే.. భూ అంత‌ర్భాగం గురించి తెలిసింది చాలా త‌క్కువ‌. సైక్ లాంటి ఆస్ట‌రాయిడ్‌ను అధ్య‌య‌నం (NASA Study) చేయ‌డం ద్వారా భూ అంత‌ర్భాగం గురించి, అరుదైన లోహాల గురించి తెలుస్తుంద‌ని నాసా భావించి.. ఈ ప్ర‌యోగం చేప‌ట్టింది. ఈ సైక్ గురు, అంగార‌క గ్ర‌హాల మ‌ధ్య ఉండ‌గా.. సూర్యుని చుట్టూ భూమి కంటే మూడు రెట్లు వేగంగా తిరుగుతోంది.


ప్ర‌స్తుతానికి ఉన్న స‌మాచారం ఆధారంగా దీనిపై నికెల్‌, ఐర‌న్‌, బంగారం త‌దిత‌ర అమూల్య‌మైన లోహాలున్నాయి. వీటి విలువ‌ను ప్ర‌స్తుత మార్కెట్ ఆధారంగా లెక్క‌గ‌డితే 10 క్వాడ్రిలియ‌న్ డాల‌ర్లుగా తేలుతుంద‌ని అంచనా. ప్ర‌స్తుతం పంపిన సైక్ ఉప‌గ్ర‌హం సైక్ ఆస్ట‌రాయిడ్‌ను 26 నెల‌ల పాటు ప‌రిశోధిస్తుందని నాసాఆ శాస్త్రవేత్త నికోలా ఫాక్స్ పేర్కొన్నారు. లోహాల ప్ర‌పంచంపై ప‌రిశోధ‌న‌కు నాసా పంపిన తొలి మిష‌న్ ఇది. కొత్త కొత్త విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి ఎదురు చూస్తున్నాం అని వివ‌రించారు.

Latest News