Site icon vidhaatha

Imran Khan | నా భార్య ఆహారంలో టాయిలెట్‌ క్లీనర్ మిక్సింగ్‌.. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని సంచలన ఆరోపణ..!

Imran Khan : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ఆరోపణ చేశారు. ఓ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్‌ క్లీనర్‌ కలిపిన ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆహారం తిన్న వెంటనే ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారని, రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన రావల్పిండి కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు.

190 మిలియన్‌ పౌండ్ల అవినీతికి సంబంధించిన కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ను రావల్పిండి జైలు వద్ద కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆయన పైన పేర్కొన్న ఆరోపణలు చేశారు. తన భార్యకు తగిన వైద్యపరీక్షలు చేయించడం లేదని, ఆమె ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేకుండా అదనంగా బ్యారెల్స్‌ ఏర్పాటు చేశారని న్యాయమూర్తి ఎదుట ఇమ్రాన్‌ ఆరోపించారు.

అయితే కస్టడీలో ఉన్నప్పుడు మీడియాతో మాటలు తగ్గించుకోవాలని ఇమ్రాన్‌ఖాన్‌కు న్యాయమూర్తి సూచించారు. దాంతో తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నందున స్పష్టత ఇవ్వడం కోసం తాను వారితో మాట్లాడుతున్నానని మాజీ ప్రధాని తన వాదన వినిపించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణల నేపథ్యంలో ఆయనకు, ఆయన భార్య బుష్రా బీబీకి రెండు రోజుల్లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఎండోస్కోపీ పరీక్షలు చేయించాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.

Exit mobile version