హిజాబ్ ధ‌రించలేద‌ని భౌతిక దాడి.. యువ‌తి బ్రెయిన్ డెడ్‌

  • Publish Date - October 23, 2023 / 11:03 AM IST

విధాత‌: ఇరాన్‌ (Iran) లో హిజాబ్ (Hijab) చ‌ట్టానికి మ‌రో యువ‌తి తీవ్రంగా గాయ‌ప‌డి ఆసుప‌త్రి పాలైంది. అర్మితా గెరావండ్ (16) అనే ఆ బాధితురాలు ప్ర‌స్తుతం కోమాలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌ధాని టెహ్రాన్ మెట్రో స‌ర్వీసులో ఆమెను మ‌హిళా పోలీసులు భౌతికంగా హింసించిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. హిజాబ్ స‌రిగా ధ‌రించ‌క‌పోడం, హిజాబ్ చ‌ట్టంపై వారితో అర్మితా వాదించ‌డంతో ఈ ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. ప్ర‌స్తుతం బాధితురాలికి బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.


ఈ ఘ‌ట‌న ఎప్పుడు జ‌రిగింద‌నే వివ‌రాలు తెలియ‌న‌ప్ప‌టికీ ఈ నెల 3వ తేదీన కుర్దిష్ హ‌క్కుల సంస్థ హెంగా తొలుత ఈ ఘ‌ట‌న‌ను బ‌య‌ట‌పెట్టింది. అనంత‌రం ఆదివారం మాత్ర‌మే అధికార వ‌ర్గాలు ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారాన్ని బ‌హిర్గ‌తం చేశాయి. అర్మితా బ‌తికే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని.. ప‌రిస్థితి రోజురోజుకీ క్షిణిస్తోంద‌ని ఇరాన్ మీడియా ఐఆర్ఎన్ఏ పేర్కొంది.


అయితే ఆమె ప‌రిస్థితికి కార‌ణం ర‌క్త‌పోటు త‌క్కువ కావ‌డ‌మేనని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. టెహ్రాన్ మెట్రో సంస్థ కూడా త‌మ ప‌రిస‌రాల్లో లేదా ట్రైన్‌లో ఎటువంటి భౌతిక దాడులూ జ‌ర‌గ‌లేద‌ని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. సీసీటీవీ రికార్డులు, ఆసుప‌త్రిలో ఆమె ప‌రిస్థితి, హ‌క్కుల సంస్థ‌ల రిపోర్టుల ప్ర‌కారం.. మ‌హిళా పోలీసులు ఆమెపై చేయి చేసుకున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ వాద‌న‌ల‌ను యువ‌తి స‌న్నిహితులు, హిజాబ్ వ్య‌తిరేక గ్రూపులు తిరస్క‌రిస్తున్నాయి.