Site icon vidhaatha

PM Modi | జూలై 8న రష్యాకు ప్రధాని మోదీ.. భారీగా ఏర్పాట్లు చేస్తున్న క్రెమ్లిన్..!

PM Modi : ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) రష్యా (Russia) పర్యటన ఖరారైంది. జూలై 8న మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin) సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఇప్పటికే రష్యా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార వర్గాలు వెల్లడించాయి.

మంగళవారం రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. ‘మేము భారత ప్రధాని పర్యటనకు సిద్ధమవుతున్నాం. అయితే తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఇరుదేశాలు కలిసి తేదీలను ప్రకటిస్తాయి. తాము పర్యటన కోసం చురుకుగా సిద్ధమవుతున్నాం. ఈ పర్యటన జరుగుతుందని నేను నొక్కి చెబుతున్నా’ అన్నారు.

ఈ ఏడాది పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 5వ సారి ప్రమాణస్వీకారం చేయగా.. నరేంద్రమోడీ భారత ప్రధానిగా మూడోసారి అధికారాన్ని చేపట్టారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఇది ప్రధాని మోడీ తొలి రష్యా పర్యటన అవుతుంది. ఉక్రెయిన్ వార్‌ని భారత్ ఇప్పటికి ఖండించలేదు. ఇరు దేశాలు దౌత్యం, సంభాషణలతో చర్చించుకోవాలని సూచించింది.

కాగా, చివరిసారిగా రష్యా అధినేత పుతిన్ 2021లో భారత్‌లో పర్యటించారు. భారత్-రష్యా వార్షిక సమ్మిట్‌కు హాజరయ్యారు. 2022 సెప్టెంబర్ 16న ఉజ్బెకిస్థాన్ సమర్‌కండ్‌లో జరిగే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు.

Exit mobile version