ర‌ష్యా విమానాశ్ర‌యంలో పాల‌స్తీనా సానుభూతిప‌రుల దాష్టీకం..

  • Publish Date - October 30, 2023 / 08:33 AM IST

  • టెల్ అవీవ్ నుంచి వ‌చ్చిన విమానంపై దాడికి య‌త్నం
  • ఎయిర్‌పోర్టులో యూదుల కోసం వెతికిన మూక‌


ఇజ్రాయెల్ – హ‌మాస్ సంక్షోభం (Israel Conflict) ప్ర‌పంచ‌దేశాల్లోనూ నిర‌స‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. అయితే నిర‌స‌న‌లు శాంతియుతంగా కాకుండా హింసాత్మ‌కంగా మార‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. తాజాగా ర‌ష్యా (Russia) లోని ఓ విమానాశ్ర‌యంలో పాల‌స్తీనా సానుభూతిప‌రులు చొర‌బ‌డ్డారు. ఏకంగా ర‌న్‌వేపైకి వెళిపోయి ఇజ్రాయెల్ రాజ‌ధాని టెల్ అవీవ్ నుంచి వ‌చ్చిన విమానంపై దాడికి య‌త్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


నైరుతి ర‌ష్యాలో ఉన్న ద‌గేస్తాన్ రాష్ట్రంలోని మ‌క్‌చ‌క్‌లా విమానాశ్ర‌యంలో ఆదివారం సాయ‌త్రం ఘ‌ట‌న చోటుచేసుకుంది. విమానాశ్రయం లోకి దూసుకొచ్చిన కొన్ని వంద‌ల మంది ఆక‌తాయిలు, నిర‌స‌నకారులు అల్లాహు అక్బ‌ర్ అంటూ నినాదాలు చేశారు. విమానాశ్ర‌యంలో ఉన్న యూదు సిబ్బంది, ప్ర‌యాణికుల కోసం తీవ్రంగా వెతికారు. ఈ క్ర‌మంలో వారికి ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుగా నిలిచి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూశారు. ఆ స‌మ‌యానికే టెల్ అవీవ్ నుంచి విమానం వ‌చ్చింద‌ని తెలియ‌డంతో నిర‌స‌న‌కారులు అటు వైపు ప‌రిగెట్టారు.


అయితే పైల‌ట్ , సిబ్బంది అప్ర‌మ‌త్త‌త‌తో ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో విమానాశ్ర‌యాన్ని మూసివేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి 60 మందిని అరెస్టు చేశామ‌ని ర‌ష్యా హోంశాఖ వెల్ల‌డించింది. ఇంకా 150 మందిని గుర్తించాల్సి ఉంద‌ని తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై ఇజ్రాయెల్ స్పందించింది. దాడి ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని.. ఇజ్రాయేలీయులు ఎక్క‌డున్నా వారి భ‌ద్ర‌త‌ను కాపాడ‌టానికి కృషి చేస్తామ‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్రస్తుత ఘ‌ట‌న‌పై ర‌ష్యా స‌రైన చ‌ర్య తీసుకుంటుంద‌ని భావిస్తున్నామ‌ని పేర్కొంది.


కాగా ద‌గేస్తాన్‌లో ముస్లిం జ‌నాభా ఎక్కువ కావ‌డం, వారి టెలీగ్రామ్ ఛాన‌ల్‌లో టెల్ అవీవ్ విమానం వ‌చ్చే స‌మ‌యాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డంతో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే ర‌ష్యాలో యూదుల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని ప్ర‌భుత్వంలో యూదు ప్ర‌తినిధిగా ఉన్న వ్య‌క్తి వాపోయారు. ఈ దేశంలోనూ త‌మ‌కు వ్య‌తిరేకంగా కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని.. ర‌ష్యా వ‌దిలి వెళ్లిపోవ‌డ‌మే శాశ్వ‌త ప‌రిష్కారంలా క‌న‌ప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


మ‌రోవైపు గాజాలో ప్ర‌తీకార దాడుల‌కు దిగిన ఇజ్రాయెల్‌.. భూత‌ల మార్గంలో అక్క‌డ‌కు తొలిసారి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. అక్టోబ‌రు 7న హ‌మాస్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో సుమారు 1400 మంది ఇజ్రాయెల్ పౌరులు చ‌నిపోగా.. 239 మంది బందీలుగా మారిపోయారు. మ‌రోవైపు ఇజ్రాయెల్ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిపిన దాడిలో 8005 మంది పాల‌స్తీనియ‌న్లు మ‌ర‌ణించార‌ని.. వారిలో 3,324 మంది మైన‌ర్లేన‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.


ఈ యుద్ధం లెబ‌నాన్‌, సిరియాల‌పైనా కాల్పుల‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. తాజాగా సిరియాలోని ఒక సైనిక స్థావరాన్ని కూల్చేశామ‌ని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మ‌రోవైపు ఇజ్రాయెల్ పంపిన డ్రోన్‌ను తాము కూల్చేశామ‌ని లెబ‌నాన్ స్థావ‌రంగా ప‌నిచేస్తున్న హిజ్‌బుల్లా ప్ర‌క‌టించింది. ఇజ్రాయెల్‌తో పోరులో త‌మ స‌భ్యులు 46 మంది మృత్యువాత ప‌డ్డార‌ని తెలిపింది. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న గాజాలోకి తొలిసారిగా ఆతి పెద్ద నిత్యావ‌స‌రాల కాన్వాయ్ ప్ర‌వేశించింది. ఈ కాన్వాయ్‌లో సుమారు 30 భారీ ట్ర‌క్కులు ఉన్నాయ‌ని ఐక్య‌రాజ్య స‌మితి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Latest News