మ‌త్తు నుంచి యువ‌త‌ను కాప‌డ‌టానికి వ్యాక్సిన్‌.. రూపొందించిన శాస్త్రవేత్త‌లు

  • Publish Date - October 26, 2023 / 10:25 AM IST

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌ల్లో అతి ముఖ్య‌మైన‌ది డ్ర‌గ్స్‌ (Drugs) . యువ‌త దీనికి బానిస కావ‌డం వ‌ల్ల మాన‌వ వ‌న‌రుల న‌ష్ట‌మే కాకుండా నేరాలూ పెరుగుతుండ‌టంతో ప‌లు దేశాల ప్ర‌భుత్వాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి. డ్ర‌గ్స్‌ను అరిక‌ట్ట‌డానికి అనేక మార్గాలు అవ‌లంబిస్తున్నా.. ఏవీ ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు. తాజాగా కొకైన్‌ (Cocaine) కు బానిస‌గా మారిన వారిని బ‌య‌ట‌ప‌డేసేందుకు ఒక వ్యాక్సిన్ (Vaccine) త‌యారుచేసిన‌ట్లు బ్రెజిల్ (Brazil) శాస్త్రవేత్త‌లు ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.


కాలిక్స్‌కోకా అని పిలుస్తున్న ఈ వ్యాక్సిన్.. కొకైన్ అల‌వాటు నుంచి త‌ప్పిస్తుంద‌ని దానిని త‌యారుచేసిన శాస్త్రవేత్త‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ప‌నిచేసే విధానాన్ని వారు వివ‌రించిన ప్ర‌కారం.. నాడీవ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేయ‌డం ద్వారా కాలిక్స్‌కోకా ప‌ని చేస్తుంది. దీని ద్వారా ఉత్తేజిత‌మైన నాడీ వ్య‌వ‌స్థ కొకైన్‌ను బ్రెయిన్ వ‌ర‌కు చేర‌కుండా నిలువ‌రిస్తుంది. యాంటీబాడీల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం ద్వారా కాలిక్స్‌కోకా ఈ ప‌ని చేయ‌గ‌లుగుతుంది. ఈ యాంటీబాడీలు భారీ ప‌రిమాణంలో ఉండి.. కొకైన్ మూల‌కాలు మెద‌డును చేర‌కుండా అడ్డుకుంటాయి. కొకైన్ వ‌ల్ల మ‌నిషికి ఉత్తేజాన్ని క‌లిగించే డొప‌మైన్ ఉత్ప‌త్తి అవుతుంద‌ని తెలిసిందే.


ఇది బ్రెయిన్ సాయంతో జ‌రుగుతుంది. అలా డొప‌మైన్ ఉత్ప‌త్తికి ప్రోత్స‌హించే మెద‌డులోని భాగానికి కాలిక్స్‌కోకా వ‌ల్ల ఉత్ప‌త్తి అయిన యాంటీబాడీలు షీల్డ్‌లా ప‌నిచేస్తాయి. దాంతో కొకైన్ తీసుకున్నా.. ఆ వ్య‌క్తి కోరుకున్న కిక్ రాదు. త‌ద్వారా అది తీసుకోవాల‌న్న కోరికా న‌శిస్తుంది అని రూప‌క‌ర్త‌లు చెబుతున్నారు. దీని సామ‌ర్థ్యంపై తొలి ద‌శ ప‌రీక్ష‌ల్లో సానుకూల ఫ‌లితాలు రావ‌డంతో.. లాటిన్ అమెరిక‌న్ మెడిసిన్ విభాగంలో ఈ వ్యాక్సిన్ యూరో హెల్త్ ఇన్నోవేష‌న్ అవార్డును గెలుచుకుని.. రూ. నాలుగు కోట్ల ప్రైజ్ మ‌నీని సైతం సొంతం చేసుకుంది.


నిజంగా ప‌నిచేస్తుందా?


శాస్త్రవేత్త‌లు దీనిని తొలిద‌శ ప‌రీక్ష‌ల్లో జంతువుల‌పైనే ప్ర‌యోగించారు. ఆ పరిశోధ‌న‌ల్లో వారికి సానుకూల ఫ‌లితాలే క‌నిపించాయి. అంతే కాకుండా ఎలుక గ‌ర్భంపైనా కొకైన్ ప్ర‌భావం ప‌డ‌కుండా కాలిక్స్‌కోకా సాయ‌ప‌డింది. దీంతో త‌ల్లి.. కొకైన్‌కు బానిస అయిన‌ప్ప‌టికీ.. ఆ ప్ర‌భావం శిశువు ఆరోగ్యంపై ప‌డ‌కుండా కాపాడొచ్చ‌ని భావిస్తున్నారు. కొన్ని సైడ్ ఎఫెక్ట్‌లు ఉన్న‌ప్ప‌టికీ.. అవి నివారించ‌ద‌గివేన‌ని శాస్త్రవేత్త‌లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు చేయ‌డానికి అన్ని అనుమ‌తులూ రావ‌డంతో.. దానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


డ్ర‌గ్స్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ త‌యారుచేయాల‌ని గ‌తంలో ప్ర‌యోగాలు జ‌రిగిన‌ప్ప‌టికీ అవి ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌లేదని ఫెడ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ మినాస్ గెరాస్‌లో సైక్రియాట్రిస్ట్‌గా ప‌నిచేస్తున్న ఫ్రెడ్రికో గార్సియా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం సైక‌లాజిక‌ల్ కౌన్సెలింగ్‌, రిహాబిలిటేష‌న్ మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. ఒక‌వేళ వ్యాక్సిన్ వ‌చ్చినా అది వీట‌న్నింటికీ అద‌నమే త‌ప్ప‌.. ఆ వ్యాక్సిన్‌తోనే మ‌త్తు నుంచి విముక్తులు కాలేర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Latest News