భూమిపై అత్యంత పురాత‌న అడ‌వి ఎక్కడ ఉన్నదో తెలుసా?

భూమిపై అత్యంత పురాత‌న‌మైన అడ‌వి (Oldest Forest) ని శాస్త్రవేత్త‌లు అమెరికా (America) లో క‌నుగొన్నారు

  • Publish Date - January 14, 2024 / 09:39 AM IST

భూమిపై అత్యంత పురాత‌న‌మైన అడ‌వి (Oldest Forest) ని శాస్త్రవేత్త‌లు అమెరికా (America) లో క‌నుగొన్నారు. న్యూయార్క్ స‌మీపంలో కైరోకు ద‌గ్గ‌ర్లో ఈ ప్రాంతం ఉన్న‌ట్లు చెబుతున్నారు. సుమారు 38.5 కోట్ల సంవ‌త్స‌రాల క్రితం ఇక్క‌డ ఆ అడ‌వి ఉండేద‌ని ఇక్క‌డి అవ‌శేషాలు చెబుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ బింగాంప్ట‌న్‌, కార్డిఫ్ యూనివ‌ర్సిటీలు సంయుక్తంగా చేసిన ఈ ప‌రిశోధ‌న‌లో ఒక‌ప్ప‌టి అడ‌వి గురించి అనేక విష‌యాలు తెలిశాయి. ఎడారి వంటి ఈ ప్రాంతంలో ఒక‌ప్పుడు చిక్క‌ని అడ‌వి ఉండేద‌ని ఇప్ప‌టికే తెలిసిన‌ప్ప‌టికీ దాని వ‌యసు, విస్తీర్ణంపై ఇప్పుడే స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఇక్క‌డి రాళ్లల్లో నిక్షిప్త‌మై ఉండిపోయిన చెట్ల వేర్ల ఆధారంగా ఈ ప‌రిశోధ‌న సాగింది. ఈ ప్ర‌క్రియ‌ను పాలియోబోట‌నీ అని వ్య‌వ‌హ‌రిస్తారు.


ఈ స‌మాచారాన్ని విశ్లేషించిన అనంత‌రం ఇక్క‌డ అడ‌వి సుమారు 400 కి.మీ. పొడ‌వునా ఉండేద‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. ఈ చెట్లు ఇప్ప‌ట్లా విత్త‌నాల ద్వారా సంతానోత్ప‌త్తి చేసేవి కావ‌ని.. స్పోర్స్ (బీజాంశాలు)ను వెద‌జ‌ల్లడం ద్వారా చెట్ల సంత‌తి పెరిగేద‌ని గుర్తించారు. భూమి మీద అడ‌వులు లేదా చెట్ల ప‌రిణామ‌క్ర‌మం ఒకే తీరున లేద‌న‌డానికి ఈ అడవే నిద‌ర్శ‌న‌మ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. కొన్ని విత్త‌నాల ద్వారా, కొన్ని పుష్పాల ప‌రాగ‌రేణువుల ఆధారంగా, మ‌రికొన్ని ఇలా బీజాంశాల ద్వారా సంతానాన్ని వృద్ధి చేసుకుని ఉంటాయ‌ని వివ‌రిస్తున్నారు. ఈ అడ‌వుల‌ను గుర్తించ‌డం కేవ‌లం రికార్డుల కోసం మాత్ర‌మే కాద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ చెట్లు జీవించి ఉన్న కాలంలో వాతావ‌ర‌ణంలో కార్బ‌న్ డై ఆక్సైడ్ ఎక్కువ‌గా ఉండేద‌ని… దానిని ఈ చెట్లు ఎలా గ్ర‌హించాయో తెలుసుకోవ‌డం ఈ ప‌రిశోధ‌న ఉద్దేశ‌మ‌ని వివ‌రించారు. ఇక్క‌డి బండ‌రాళ్లలో ఉండిపోయిన వేర్లు ప‌రిశోధ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఒక విధంగా ఇది.. వ‌ర్త‌మానం నుంచి గ‌తంలోకి తొంగి చూడ‌టం లాంటిద‌ని అభివ‌ర్ణించారు.

Latest News