Sheikh Hasina | ఇది ‘అన్యాయ’ విచారణ : మరణదండనపై హసీనా స్పందన

మరణశిక్షపై మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రమైన స్పందన. ICT విచారణను “మోసపూరిత, పక్షపాతమైంది”గా అభివర్ణించిన హసీనా, తననుతాను రక్షించుకునే అవకాశమే ఇవ్వలేదని ఆరోపణ. యూనస్ ప్రభుత్వ చర్యలపై ఘాటైన వ్యాఖ్యలు

Sheikh Hasina statement after ICT verdict – reaction photo

‘Bangladesh Tribunal Verdict Reveals Intent Of Extremist Forces’, Says Former PM Hasina

నన్ను రక్షించుకునే అవకాశమే ఇవ్వలేదు – ఇదొక పక్షపాత విచారణ : షేక్​ హసీనా

బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT-BD) తనపై విధించిన మరణశిక్ష తీర్పుపై మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఘాటుగా స్పందించారు. ధాకా ట్రైబ్యునల్ తీర్పు వెలువడిన కొన్ని నిమిషాలకే విడుదల చేసిన ప్రకటనలో, ఇది “రాజకీయ ప్రతీకారం కోసం నడిపించిన మోసపూరిత విచారణ”, “ఒక పక్షపాత నాటకం” అని హసీనా ఆరోపించారు.

ఈ తీర్పు నిర్వచనాత్మకంగా ఒక అన్యాయ ప్రభుత్వంలో పనిచేస్తున్న అతివాద ముఠాల దురుద్దేశాన్ని బయటపెట్టిందని ఆమె ప్రకటించారు. తనకు, తన పార్టీకి రక్షణ కల్పించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని, విచారణకు సంబంధించి న్యాయవాదులను కూడా తను ఎన్నుకునే స్వేచ్ఛ లేకపోయిందని హసీనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నాపై చేసిన ఆరోపణలు అబద్ధం, నేను ఎటువంటి ఆదేశాన్నీ ఇవ్వలేదు : హసీనా

నా మీద ICTలో చేసిన అన్ని ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నానంటూ హసీనా పేర్కొన్నారు. జూలై–ఆగస్టు 2024లో జరిగిన హింసపై ఆమె బాధ వ్యక్తం చేస్తూ, రాజకీయ విభేదాల వల్ల రెండు వైపులా ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నేను సంతాపం వ్యక్తం చేస్తున్నా. కానీ నిరసనకారులను చంపమని నేను లేదా మా పార్టీ నాయకులు ఎప్పుడూ ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే, ICT న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇప్పటికే యూనస్ ప్రభుత్వానికి అనుకూలంగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉన్నప్పటికీ వారు విచారణలో కొనసాగడమే పక్షపాతానికి నిదర్శనమని ఆమె అన్నారు.

ALSO READ: షేక్​ హసీనాకు మరణశిక్ష: బంగ్లా ట్రిబ్యునల్​ సంచలన తీర్పు

తీర్పును తిరస్కరించడానికి హసీనా వెల్లడించిన మూడు కారణాలు

  1. తనకు అనుకూలంగా మాట్లాడిన ఏ సీనియర్ న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాది అయినా తొలగించబడ్డారు లేదా మౌనం పాటించేలా ఒత్తిడి చేశారు.
  2. ICT కేవలం అవామీ లీగ్ సభ్యులనే విచారిస్తోంది; ప్రతిపక్ష పార్టీల అఘాయిత్యాలను విచారించలేదు.
  3. మైనారిటీవర్గాలపై జరిగిన హింస, ప్రత్యర్థి పార్టీల దాడులను పట్టించుకోలేదు.

“బంగ్లాదేశీయులు మోసపోరు… యూనస్ ప్రభుత్వం అప్రజాస్వామికం”

డాక్టర్ మహ్మద్ యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, దేశ ప్రజలు ఈ అప్రామాణిక, హింసాత్మక, ప్రభుత్వాన్ని చూడగానే నిజం అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ICT ఇచ్చిన తీర్పులు న్యాయం కోసం కాదు, అవామీ లీగ్‌ను బలహీనపర్చడానికి, యూనస్ ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టడానికి మాత్రమేనని తీవ్రంగా ఆక్షేపించారు. దేశంలో ఒక్క పౌరుడూ యూనస్‌కు ఓటు వేయలేదు… అయినా అతడు దేశాన్ని నడుపుతున్నాడు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని హసీనా ప్రశ్నించారు. తాను ఎప్పుడూ పారిపోనని, ఒక “సరైన, నిష్పక్షపాత, అంతర్జాతీయ స్థాయి విచారణ” అయితే ఆనందంగా ఎదుర్కొంటానని హసీనా తెలిపారు. దీని కోసం ఆమె ఇప్పటికే యూనస్ ప్రభుత్వాన్ని ICC (International Criminal Court), The Hague ముందు నిలబెట్టాలని సవాల్ చేసినట్లు గుర్తుచేశారు. ఈ ICTకి అంతర్జాతీయ గుర్తింపు లేదు… నిష్పక్షపాతం అసలే లేదు… న్యాయమూర్తులకు స్వతంత్రత లేదు. ఇది పేరుకు మాత్రమే ‘ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్’. వాస్తవానికి ఇది ఒక రాజకీయ నాటకమని దుయ్యబట్టారు.

ఆమె ప్రకటనతో, బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం మరింత తీవ్ర దశలోకి ప్రవేశించినట్లు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తీర్పును మేము ‘గమనించాం’ : భారత్​

కాగా, బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసినా‌కు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT-BD) విధించిన మరణశిక్ష అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న సమయంలో, భారత విదేశాంగ శాఖ (MEA) తమ అధికారిక ప్రతిస్పందనను విడుదల చేసింది. ఢిల్లీ, ఈ తీర్పును “గమనించాము” (India has noted the verdict) అని పేర్కొంటూ, బంగ్లాదేశ్ ప్రజల శాంతి, ప్రజాస్వామ్యం, సమగ్రత, స్థిరత్వాన్ని భారత్ ప్రాధాన్యంగా చూస్తుందని స్పష్టం చేసింది.

భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సుకు కట్టుబడి ఉంది. ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం—ఇవన్నీ మాకు ముఖ్యమైన అంశాలు” అని విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. అదేవిధంగా, ఈ లక్ష్యాల సాధన కోసం అన్ని వర్గాలతో లిసి నిర్మాణాత్మకంగా పనిచేస్తామని ఢిల్లీ పేర్కొంది.