నూత‌న విశ్వ‌సుంద‌రి షెన్నిస్ ప‌లాషియ‌స్‌.. ఫైన‌ల్‌లో భార‌త యువ‌తిపై గెలుపు

నిక‌రాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ ప‌లాషియ‌స్.. విశ్వ‌సుంద‌రి (Miss Universe - 2023) కిరీటాన్ని చేజిక్కించుకుంది

  • Publish Date - November 19, 2023 / 07:16 AM IST

విధాత‌: నిక‌రాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ ప‌లాషియ‌స్.. విశ్వ‌సుంద‌రి (Miss Universe – 2023) కిరీటాన్ని చేజిక్కించుకుంది. ఎల్ సాల్వెడార్ రాజ‌ధాని సాన్ సాల్వ‌డార్‌లో జ‌రిగిన 72వ మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో న్యాయ‌నిర్ణేతలు విశ్వ‌సుంద‌రిగా షెన్నిస్‌ (Sheynnis Palacios) ను ఎంపిక చేశారు. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ రౌండ్‌లో ఆమె భార‌త్‌కు చెందిన శ్వేతా శార‌దాను ఓడించి కిరీటాన్ని సొంతం చేసుకుంది. భావోద్వేగం, సంతోషంతో షెన్నిస్ పొంగిపోతూ ఉండ‌గా.. 2022 మిస్ యూనివ‌ర్స్ అయిన ఆర్ బోనీ గాబ్రియేల్.. విశ్వ సుంద‌రి కిరీటాన్ని ఆమెకు అందించింది.


ఫైన‌ల్ రౌండ్‌లో భాగంగా న్యాయ‌నిర్ణేత‌లు ప్ర‌శ్నిస్తూ… ఏ ప్ర‌ముఖుడిలా ఒక రోజు జీవించాల‌నుకుంటున్నావు అని షెన్నిస్‌ను అడిగారు. అందుకు ఆమె.. బ్రిటిష్ త‌త్వ‌వేత్త, స్త్రీవాది అయిన మేరీ వాల్‌స్టోన్‌క్రాఫ్ట్‌లా ఉండాల‌నుకుంటున్నాన‌ని స‌మాధాన‌మిచ్చింది. మ‌హిళ‌కు ఉండే అన్ని ప్ర‌తిబంధ‌కాల‌నూ ఆమె ఛేదించార‌ని.. ప్ర‌స్తుతం మ‌హిళ‌ల‌కు అడ్డు అనేదే లేద‌ని షెన్నిస్ త‌న స‌మాధానంలో పేర్కొంది. 23 ఏళ్ల ఈ విశ్వ‌సుంద‌రి ఈ పోటీలో పాల్గొనే ముందు వ‌ర‌కు టీవీ యాంక‌ర్‌గా ప‌నిచేసేది. త‌న జీవితంలో ఎక్కువ భాగం నిక‌రాగ్వా రాజ‌ధానిలోనే గ‌డిపిన షెన్నిస్.. 2016లో మిస్ టీన్ నిక‌రాగ్వాగా నిలిచింది.


2021 మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో టాప్ 40లో నిలిచి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. చ‌దువుల్లోనూ టాప‌ర్‌గా నిలిచే షెన్నిస్‌… సెంట్ర‌ల్ అమెరిక‌న్ యూనివ‌ర్సిటీ నుంచి మాస్ క‌మ్యునికేష‌ష‌న్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. వాలీబాల్‌లో యూనివ‌ర్సిటీ స్థాయి క్రీడాకారిణిగా స‌త్తా చాటింది. ఫైన‌ల్‌కు గంట ముందు ఆమె త‌న ఆనందాన్నిఇన్‌స్టాలో పంచుకుంది. ‘ఈ రాత్రిని నేను నాలోని చిన్నారికి, త‌మ ల‌క్ష్యాల కోసం క‌ష్ట‌ప‌డుతున్న ప్ర‌తి మ‌హిళ‌కు అంకితం ఇస్తున్నాను. మ‌న‌కు ఆకాశం ఒక‌టే హ‌ద్దు. పెద్ద పెద్ద ల‌క్ష్యాలు పెట్టుకుని పోరాడ‌దాం’ అని రాసుకొచ్చింది.