Site icon vidhaatha

Oman Shooting | మస్కట్‌లో ఘోరం.. కాల్పులకు తెగబడ్డ ఐసిస్‌.. భారతీయుడు సహా ఆరుగురు దుర్మరణం

Oman Shooting : ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో ఘోరం జరిగింది. షియా మసీదు సమీపంలో భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పాకిస్థానీలు, ఒక భారతీయుడు ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో భారతీయుడు ఉన్న విషయాన్ని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఎక్స్ వేదికగా వెల్లడించింది.

గాయపడిన 30 మందిలో కూడా ఒక భారతీయుడు ఉన్నట్లు ఒమన్‌ అధికారులు తెలిపారు. మస్కట్‌లో జరిగిన కాల్పుల్లో ఒక భారతీయుడు మృతి చెందగా, మరో భారతీయుడు గాయపడ్డారని ఒమన్‌ విదేశాంగ శాఖ అక్కడి భారత రాయబార కార్యాలయానికి తెలియజేసింది. దాడిని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడిలో భారత పౌరుడు మరణించడంపై విచారం వ్యక్తం చేసింది.

మరోవైపు పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అక్కడ మరణించిన తమ దేశస్థుల మృతదేహాలను పాకిస్థాన్‌కు తీసుకొచ్చేందుకు ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మహమ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేన్ 7వ శతాబ్దంలో చేసిన బలిదానం జ్ఞాపకార్థం నిర్వహించే అషురా వేడుక సందర్భంగా ఈ కాల్పులు జరిగాయి.

అయితే ఈ దాడికి పాల్పడ్డ ముగ్గురు ముష్కరులను ఒమన్‌ సెక్యూరిటీ సిబ్బంది హతమార్చారు. దాడి పాల్పడింది ఎవరు అనే కోణంలో అక్కడి అధికారుల దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మస్కట్‌లో కాల్పులకు పాల్పడింది తామేనని ఐసిస్‌ ఉగ్రవాదులు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Exit mobile version