వీర్య క‌ణాల నాణ్య‌త‌పై వీటితోనూ దుష్పరిణామాలు

దిగుబ‌డుల‌ను పెంచ‌డానికి, చీడ‌పీడ‌ల‌ను అరిక‌ట్ట‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పురుగుమందుల (Pesticides) వాడ‌కం బాగా పెరిగిన విష‌యం తెలిసిందే

  • Publish Date - November 18, 2023 / 09:45 AM IST

విధాత‌: దిగుబ‌డుల‌ను పెంచ‌డానికి, చీడ‌పీడ‌ల‌ను అరిక‌ట్ట‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పురుగుమందుల (Pesticides) వాడ‌కం బాగా పెరిగిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా వివిధ దేశాల్లో హ‌రిత‌విప్ల‌వాలు ప్రారంభ‌మైన త‌ర్వాత పెస్టిసైడ్‌లు చ‌వ‌క‌గా ల‌భిస్తుండ‌టంతో రైతులు విరివిగా ఉప‌యోగిస్తున్నారు. అయితే వీటి వాడ‌కం వ‌ల్ల వివిధ దుష్ప‌రిణామాలు ఉంటాయ‌ని శాస్త్రవేత్త‌లు ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిస్తూనే ఉన్నారు.


తాజాగా పురుగుమందుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మాన‌వుల్లో వీర్య క‌ణాల నాణ్య‌త‌ (Sperm Count) , సంఖ్య త‌గ్గిపోయింద‌ని ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ అంశంపై చేసిన 25 ప‌రిశోధ‌న‌ల‌ను, 20 అధ్య‌య‌నాల‌ను క్రోడీక‌రించి ఒక ప‌రిశోధ‌నా ప‌త్రాన్ని (Study) శాస్త్రవేత్త‌లు త‌యారు చేశారు. ఈ వివ‌రాలు ఎన్విరాన్‌మెంట‌ల్ హెల్త్ ప‌ర్‌స్పెక్టివ్స్ అనే జర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. దీని ప్ర‌కారం.. పురుగుమందుల ప్ర‌భావానికి లోను కావ‌డం వ‌ల్ల గ‌త 50 ఏళ్ల‌లో పురుషుల్లో వీర్య క‌ణాల సాంద్ర‌త 50 శాతానికి పైగా త‌గ్గిపోయింద‌ని తేలింది.


దీనికి కార‌ణం ఆర్గానో ఫాస్పేట్స్‌, ఎన్ మిథైల్ కార్బామేట్స్ అనే ర‌సాయ‌నాలు ఉండే పురుగు మందుల‌ను ఉప‌యోగించ‌డ‌మేన‌ని అధ్య‌య‌నం పేర్కొంది. ఈ ఆర్గానోఫాస్పేట్‌ల‌ను హెర్బిసైడ్‌లు, పెస్టిసైడ్లు, ఇన్‌సెక్టిసైడ్‌ల‌ను త‌యారుచేయ‌డానికి విరివిగా ఉప‌యోగిస్తారు. కృత్రిమ ప్లాస్టిక్‌లు, ద్రావ‌కాల త‌యారీలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కీట‌కాలు, పురుగుల నాడీ వ్య‌వ‌స్థ‌ను, బ్రెయిన్‌ను విచ్ఛిన్నం చేయ‌డం ద్వారా ఇవి పంట‌పొలాల‌ను ర‌క్షిస్తాయ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు.


‘ఈ మందులు పురుషుల్లో వంధ్య‌త్వానికి కార‌ణ‌మ‌వుతున్నాయని చెప్ప‌డానికి ఎటువంటి సంకోచం అవ‌స‌రం లేదు. సంతానం కోసం ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యేంత వ‌ర‌కు వీటి దుష్ప్ర‌భావాన్ని మ‌నం గుర్తించ‌లేం. కొంత మంది అప్పుడూ గుర్తించ‌లేక‌పోతున్నారు’ అని అధ్య‌య‌నంలో పాల్గొన్న ద యూనివ‌ర్సిటీ ఆఫ్ ఉతా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని ప్రొఫెస‌ర్ డా.అలెగ్జాండ‌ర్ స్ప‌ష్టం చేశారు.


వీరిపైనే ఎక్కువ ప్ర‌భావం


అయితే పురుగుమందుల సాంద్ర‌త ఎక్కువ‌గా ఉన్న కూర‌గాయ‌లు, ప‌ళ్లు తిన్న‌వారి కంటే వ్య‌వ‌సాయ క్షేత్రంలో వాటిని ఉప‌యోగించేవారిపైనే వీటి దుష్ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఈ అధ్య‌య‌నం తెలిపింది. రైతులు, తోట‌ప‌ని చేసేవారు. ఆ ర‌సాయ‌నాల ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌నిచేసే వారిపై ఈ ప్ర‌భావం అధికంగా ఉంటుంది.


ప్ర‌పంచ‌వ్యాప్తంగా అలాంటి వారి వీర్య క‌ణాల సాంద్ర‌త‌ను ప‌రిశీలించ‌గా.. భారీ త‌గ్గుద‌ల న‌మోదైంద‌ని తేలింది. సంఖ్య ఒక‌టే కాకుండా వాటి చ‌ల‌న‌శీల‌త కూడా బాగా దెబ్బ‌తింద‌ని.. సంతానం క‌ల‌గ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని మౌలిక అంశాలూ పురుగుమందుల వ‌ల్ల దెబ్బ‌తింటున్నాయ‌ని వ‌ర్జీనియాలోని జార్జ్ మాస‌న్ యూనివ‌ర్సిటీ డీన్ మెలిసా పెర్రీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Latest News