న్యూఢిల్లీ: ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది. మనీలాకు ఆగ్నేయ దిశగా 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనోవా ద్వీపంలో భూకంప తీవ్రతతో అనేక భవనాలు కొన్ని సెకన్ల పాటు భారీగా కంపించాయి.
భవనాలు..షాపింగ్ మాల్స్ ఉయ్యాలలు ఊగినట్లుగా కంపించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ప్రాంతంలో మరిన్ని సార్లు ప్రకంపనలు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడికాలేదు. కొన్ని భవనాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు వారాల క్రితమే ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంప ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
సముద్రం అల్లకల్లోలం
తాజా భూకంపంతో ఫిలిప్పీన్స్ తీరంలో సముద్రం అల్లకలోలంగా మారింది. దాదాపు 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇండోనేసియా, పలావ్ తీరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఇకపోతే మయన్మార్ లోనూ భూకంపం భయపెట్టింది. రిక్టర్ స్కేల్ పై 4.2గా భూకంప తీవ్రత నమోదైంది.