ఉద్యోగుల సంతృప్తి స్థాయుల్లో భార‌త్ రెండో స్థానంలో… అట్ట‌డుగున జ‌పాన్‌

  • Publish Date - November 4, 2023 / 08:54 AM IST

ఉద్యోగుల సంతృప్తి సంతోషం (Employees Wellbeing) విష‌యంలో భార‌త్ (India) ప్ర‌పంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. మెక‌న్సీ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఉద్యోగుల‌ను ప్ర‌శ్నించి వారి సంతృప్తి స్థాయుల‌పై నివేదిక రూపొందించింది. నివేదిక (Study) ప్ర‌కారం ఉద్యోగుల సంతోషం స్థాయిల్లో తుర్కియే తొలి స్థానంలో నిల‌వ‌గా.. జ‌పాన్ అట్ట‌డుగున నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగుల శారీరిక‌, మాన‌సిక‌, ఆధ్యాత్మిక‌, సామాజిక ఆరోగ్యం.. ఇలా వివిధ కోణాల్లో ఉద్యోగుల నుంచి స‌మాధానాలు సేక‌రించి క్రోడీక‌రించారు.


సుమారు 30 దేశాల నుంచి 30 వేల మంది ఉద్యోగులు ఈ స‌ర్వేలో పాల్గొన్నారు. భార‌తీయ ఉద్యోగులు ఇచ్చిన స‌మాచారాన్ని విశ్లేషించ‌గా.. 81 శాతం మంది ఉద్యోగులు త‌మ శారీరిక ఆరోగ్యం సంతృప్తిక‌రంగానే ఉంద‌ని తెలిపారు. మానసిక ఆరోగ్యంలో 79 శాతం, సామాజిక‌, ఆధ్యాత్మిక కోణాల్లో 78 శాతం ఆనందంగానే ఉన్నామ‌ని వెల్ల‌డించారు. ఉద్యోగాల్లో తీవ్ర ఒత్తిడి (బ‌ర్నౌట్‌) పాల‌వుతున్నామ‌ని 59 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. ఇది సౌదీ అరేబియాలో 36 శాతంగానూ, ఈజిప్ట్, చిలీల్లో 33 శాతంగానూ న‌మోదైంది. కామెరూనియ‌న్ దేశ‌స్థులు ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ‌గా 9 శాతం సంద‌ర్భాల్లో మాత్ర‌మే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.


మొత్తంగా చూసుకుంటే 29 శాతం మంది త‌ము విధి నిర్వ‌హ‌ణ‌లో బ‌ర్నౌట్ అవుతున్నారు. వీరిలో 50 శాతం మంది త‌మ ఉద్యోగాన్ని వ‌దిలేయ‌డానికి మొగ్గు చూపుతున్నామ‌ని అంగీక‌రించారు. చిన్న చిన్న కంపెనీల్లో ప‌నిచేస్తూ.. 18 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు ఎక్కువ‌గా తీవ్ర ఒత్తిడి పాల‌వుతున్నార‌ని నిపుణులు పేర్కొన్నారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా మేనేజ్‌మెంట్ లెవ‌ల్ ఉండే వారిక‌న్నా కింది స్థాయి ఉద్యోగులే ఎక్కువ ఒత్తిడిలో మునిగిపోతున్నార‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. అలాగే స‌ర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు మంది తాము ఉద్యోగాల్లో చాలాసార్లు అశ‌క్త‌కు, నీర‌సానికి లోనవుతున్నామ‌ని తెలిపారు. మ‌రోవైపు జ‌పాన్‌ (Japan) లో ఉద్యోగుల ఆరోగ్యం ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ట్లు ఈ ఫ‌లితాలను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.


దీర్ఘ‌కాల‌, శాశ్వ‌త ఉద్యోగాలు ఇక్క‌డ ఎక్కువ ల‌భిస్తాయి. ఇది ఒక ర‌కంగా మంచి విష‌యంలానే అనిపించిన‌ప్ప‌టికీ.. మెరుగైన అవ‌కాశాల‌ను అందుకోవాల‌నుకునే యువ‌త‌కు ఇవి ప్ర‌తిబంధ‌కాలుగా మారాయ‌ని నివేదిక అభిప్రాయ‌ప‌డింది. అంతే కాక జ‌పాన్ ఉద్యోగులు తాము అల్ప‌జీవులమ‌నే భావ‌న‌తోనే ఎక్కువ ఉంటార‌ని.. అదీ ఈ స‌ర్వేపై ప్ర‌భావం చూపించి ఉండొచ్చ‌ని ఒక జ‌పాన్ వ్య‌వ‌హారాల నిపుణుడు పేర్కొన్నారు. అలా అని స‌మ‌స్య లేద‌ని చెప్ప‌లేమ‌ని.. జ‌పాన్ కార్యాల‌యాల్లో ఉద్యోగంపై అసంతృప్తి, ఒత్తిడి ఎక్కువ‌గానే క‌నిపిస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం జ‌పాన్ మార్కెట్ దీర్ఘ‌కాల ఉద్యోగ ఒప్పందాల నుంచి స్వ‌ల్ప కాల ఒప్పందాల‌కు మ‌ళ్లుతోంది. ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంద‌ని నివేదిక తెలిపింది.