Site icon vidhaatha

Earthquakes | తైవాన్‌లో వరుస భూకంపాలు.. ఒక్క రాత్రిలో 80 సార్లు కంపించిన భూమి..!

Earthquakes : తైవాన్‌ను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. గత అర్ధరాత్రి నుంచి గంటల వ్యవధిలోనే 80 సార్లు భూమి కంపించింది. భూకంపాల భయంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చిన జనం రాత్రంతా రోడ్ల మీదనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. తూర్పు ఆసియా దేశమైన తైవాన్‌లో ఇంకా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.

వరుస భూకంపాల ధాటికి ఇప్పటికే కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఏప్రిల్‌ తొలి వారంలో కూడా ఈ ద్వీప దేశం భారీ భూకంపం ధాటికి వణికిపోయింది. తైవాన్‌ తూర్పు ప్రాంతమంతా సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు భూప్రకంపనలతో వణికిపోయింది.

భారీ ప్రకంపనల ధాటికి రాజధాని తైపీలో భవనాలు ఊగిపోయాయి. భూకంప కేంద్రం హువాలిన్‌లో నమోదయ్యిందని, ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రకంపనలు చోటుచేసుకోగా వాటిలో రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రత చూసిన భూకంపం అతిపెద్దదని అక్కడి అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 3న ఈ ప్రాంతంలోనే 7.2 తీవ్రతతో భూకంపం సంభవించగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి.

కాగా, రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉండటంతో తైవాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 1993లో రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం 2,000 మందిని బలితీసుకుంది. ఆ తర్వాత 2016లో తైవాన్‌ దక్షిణ ప్రాంతంలో సంభవించిన భూకంపం ధాటికి 100 మంది మరణించారు. ప్రాణ నష్టం లేకపోయినా ఏప్రిల్‌ 3 నాటి భూకంపం తైవాన్‌లో గత పాతికేళ్లలోనే భారీ భూకంపంగా నమోదయ్యింది.

Exit mobile version