Site icon vidhaatha

పంది కిడ్నీ అమర్చిన తొలి పేషెంట్‌ మృతి.. అసలు జెనోట్రాన్స్‌ప్లాటేషన్‌ అంటే ఏమిటి?

మసాచూసెట్స్‌: బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను అవసరం ఉన్న ఇతర పేషెంట్లకు వాడటం విన్నదే. అయితే.. పలు జంతువుల నుంచి కూడా అవయవాలను మనుషులకు అమర్చడం కూడా ఉన్నది. 1980లో తొలిసారి జంతువుల నుంచి సేకరించిన గుండెను విజయవంతంగా అమర్చడంతో జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనే ప్రక్రియ మొదలైంది. అయితే.. పంది నుంచి సేకరించి, ఆధునీకరించిన కిడ్నీని అమర్చిన తొలి పేషెంట్‌ మే 11, 2024న మృతి చెందాడు.

చనిపోవడానికి సుమారు రెండు నెలల ముందు ఆయనకు ఈ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. రిచర్డ్‌ రిక్‌ స్లేమాన్‌ అనే 62 ఏళ్ల రోగి కుటుంబీకులు మాత్రం ఆయన చనిపోవడానికి పంది కిడ్నీ అమర్చడమే కారణమని చెప్పడం లేదు. ఈ ఆపరేషన్‌ నిర్వహించిన మసాచూసెట్స్‌ జనరల్‌ హాస్పిట్‌ వర్గాలు సైతం ఆయన మరణాన్ని కిడ్నీ మార్పిడితో ముడిపెట్టడం లేదు. మసాచూసెట్స్‌ హాస్పటల్‌ వైద్యుల కృషితో రిక్‌తో తాము మరో ఏడు వారాలు గడపగలిగామంటూ ధన్యవాదాలు తెలిపారు.

అయితే.. అసలీ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటే ఏమిటి.. దానిలో ఇబ్బందులు ఏమిటో వైద్య వర్గాలు వివరిస్తున్నాయి.

ఏదైనా జంతువు నుంచి సేకరించిన అవయవాలను మనుష్యులకు అమర్చడమే జెనోట్రాన్స్‌ప్లంటేషన్‌ అని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) పేర్కొంటున్నది. అవయవదానం కోరుకునేవారికి, అవయవదానం చేసేవారికి మధ్య సంఖ్యాపరంగా భారీ లోటు ఉండటంతో జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనేది అత్యంత అవసరమైనదిగా మారింది. 1980లో తొలిసారి జంతువు నుంచి సేకరించిన గుండెను మనుషులకు విజయవంతంగా అమర్చగలిగారు. ఒక్క అమెరికాలోనే 90వేల మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారని, అవయవదానం లభించక ఏటా మూడు వేల మంది చనిపోతున్నరని 2024లో నేచర్‌ పత్రికలో ఒక కథనం వచ్చింది. న్యూరోడీజెనరేటివ్‌ సమస్యలు, డయాబెటిస్‌ వంటివాటికి జంతువుల నుంచి సేకరించిన కణజాలాలు ఉపయోగపడుతాయని కొలంబియా యూనివర్సిటీ సర్జరీ విభాగం వెబ్‌సైట్‌ పేర్కొంటున్నది.

పందులను ఎందుకు వినియోగిస్తారు?

మనుషుల్లో దెబ్బతిన్న హృదయనాళాల స్థానంలో పందుల రక్త నాళాలను గత 50 ఏళ్లుగా అమర్చుతూనే ఉన్నారు. పంది శరీర నిర్మాణం, శారీరక పరామితులు మానవులకు దగ్గరగా ఉంటాయట. అంతేకాకుండా.. పందుల పెంపకం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో వాటినే ఎక్కువగా వినియోగిస్తారు. అనేక రకాల పందులను ఫామ్‌లలో పెంచడం ద్వారా తగినంత పరిమాణంలో అవయవాలు ఎదిగి, మానవుల నిర్దిష్ట అవసరాలకు పనికొస్తాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

2022 జనవరిలో తొలిసారి జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా పంది గుండెకు జన్యుపరమైన మార్పులు చేసి మనిషికి అమర్చారు. అయితే.. ఆ పేషెంట్‌ తనకు అమర్చిన పంది గుండెలో గుర్తుతెలియని వైరస్‌ సహా పలు కారణాలతో రెండు నెలలకే చనిపోయాడు. ఆ వైరస్‌.. గుండె పనితీరును ప్రభావితం చేసి ఉండొచ్చని వైద్యులు అప్పట్లో భావించారు. అయితే.. జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిపిన పేషెంట్‌ శరీరం సదరు అవయవాన్ని తిరస్కరించకూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

 

Exit mobile version