పంది కిడ్నీలు బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తికి అమర్చిన చైనా వైద్యులు

  • Publish Date - April 11, 2024 / 10:36 AM IST

  • ఇప్పటికి 13 రోజులుగా విజయవంతంగా పనిచేస్తున్న మూత్రపిండాలు

బీజింగ్‌: ఇతర జంతువుల అవయవాలను మానవ శరీరాల్లోకి మార్పిడిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా వైద్యులు ఒక పంది కిడ్నీలను బ్రెయిన్‌డెడ్‌ అయి వ్యక్తి శరీరంలోకి మార్చారు. అంతకు ముందు ఆ కిడ్నీలకు జన్యుపరమైన మార్పులు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైందని, ఇప్పటికి 13 రోజులుగా మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఎయిర్‌ఫోర్స్‌ మెడికల్‌ యూనివర్సిటీ సీజింగ్‌ హాస్పిటల్‌ వైద్యుడు క్విన్‌ వెయిజున్‌ తెలిపారు. చైనాలో ఇటువంటి అవయవ మార్పిడి ఇదే తొలిసారి. గతంలో అమెరికాలో ఇటువంటి ప్రయోగాలు చేశారు. మార్చి 25, 2024న వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించింది. ఇదే బృందం కొద్దివారాలకు ముందు పంది కాలేయాన్ని విజయవంతంగా మనిషి శరీరంలోకి మార్చింది.

పంది సమర్థవంతంగా పనిచేస్తున్నదని, దాన్ని అమర్చిన వ్యక్తి నుంచి మూత్రం సాధారణ స్థాయిలో వస్తున్నదని క్విన్‌ వెయిజున్‌ చెప్పారు. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు సీఆర్‌ఐఎస్‌పీఆర్‌/కాస్‌9 జన్యు ఎడిటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. తద్వారా పంది కిడ్నీల్లోకి మనిషి జన్యువులను ప్రవేశపెట్టారు. దీనికితోడు పంది కిడ్నీలోని మూడు జన్యువులను తొలగించారని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. వైద్యశాస్త్రం అభివృద్ధికి సహకరించేందుకు సదరు పేషెంట్ల కుటుంబ సభ్యులు కిడ్నీ, కాలేయ మార్పిడికి అంగీకరించారు.

పంది కిడ్నీలే ఎందుకు?

చైనాలో ఏటా లక్షల మంది తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. వారికి ఉన్న ఏకైక ప్రత్యామ్నా మార్గం మూత్రపిండాల మార్పిడి. అయితే.. బాధితులు లక్షల్లో ఉంటే.. మూత్రపిండాల మార్పిడులు మాత్రం సుమారుగా 10వేల వరకూ ఉంటున్నాయని గత వారం వియ్‌చాట్‌ పోస్ట్‌లో ఎయిర్‌ఫోర్స్‌ మెడికల్‌ యూనివర్సిటీ యూరాలజీ డిపార్ట్‌మెంట్‌ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో జంతు కణజాల అవయవమార్పిడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంటే.. ఒక రకమైన జీవి నుంచి మరొకరకమైన జీవికి అవయమాలను మార్పిడి చేయడం.

అయితే.. పందులు మానవుల జీవక్రియకు దగ్గర ఉండటమే కాకుండా, కొన్ని అవయవాల పరిమాణం కూడా దగ్గరగా ఉంటుంది. అందుకే పందులను తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారు. గతంలో కోతులను ఇటువంటి ప్రయోగాలకు వాడినప్పటికీ వాటి నుంచి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉన్న నేపథ్యంలో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ వాటిని నిషేధించింది. అయితే.. ఇటువంటి మార్పిడులపై నైతిక ఆందోళనలు కూడా ఉన్నాయి.

భయాలూ ఉన్నాయి

ఇటువంటి అవయవ మార్పిళ్లలో జంతువుల నుంచి మనుషులకు కొత్త వ్యాధులు సంక్రిమించే ప్రమాదాలు లేకపోలేదన్న భయాలూ ఉన్నాయి. అదే సమయంలో జంతువుల హక్కులను ఈ అవయవ మార్పిళ్లు విస్మరిస్తున్నాయని జంతు సంరక్షణ ఉద్యమం అభ్యంతరం చెబుతున్నది.

Latest News