Site icon vidhaatha

Donald Trump | ఉక్రెయన్‌ యుద్ధంపై డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. మళ్లీ గెలిస్తే యుద్ధాన్ని ఆపిస్తానని వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ గెలిస్తే.. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధాన్ని ఆపిస్తానని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతినబూనారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైనందుకు ట్రంప్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదీమిర్‌ జెలెన్స్కీ శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయకులు శుక్రవారం (జూలై 19) ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ‘జెలెన్స్కీ, నేను ఫోన్‌లో మంచిగా మాట్లాడుకున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం పొందడంపై జెలెన్స్కీ నన్ను అభినందించారు’ అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
‘నాతో జెలెన్స్కీ మాట్లాడటాన్ని అభినందిస్తున్నా. ప్రపంచానికి శాంతిని తెస్తానని, అనేక జీవితాలను బలిగొన్న, అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన యుద్ధాన్ని మీ తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ఆపిస్తాను’ అని ట్రంప్‌ రాశారు. హింసకు ముగింపు పలికేందుకు ఇరుపక్షాలు కలిసి చర్చించుకుంటాయని, ఉభయుల శ్రేయస్సుకు బాటలు తీస్తారని పేర్కొన్నారు. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఉభయుల సంభాషణ సందర్భంగా జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. ఈ సమయంలో అమెరికా ప్రజలు ఐక్యంగా నిలిచారని పేర్కొన్నారు. తాను ట్రంప్‌తో మాట్లాడిన విషయాన్ని జెలెన్స్కీ తన ఎక్స్‌ ఖాతాలో తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైనందుకు ట్రంప్‌తో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానని పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన దాడి ఘటనను ఖండించానని తెలిపారు.

Exit mobile version