Donald Trump : మా అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150సార్లు పేల్చేయవచ్చు

మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150సార్లు పేల్చేయవచ్చని ట్రంప్ వ్యాఖ్యలు. అణు నిరాయుధీకరణపై పుతిన్‌, జిన్‌పింగ్‌తో చర్చించినట్లు తెలిపారు.

Donald Trump

న్యూఢిల్లీ : మా వద్ధ ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయవచ్చని..అయితే ఆ అవసరం లేదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అణు నిరాయుధీకరణ అనేది గొప్ప విషయమని, ప్రతిఒక్కరూ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని హితవు పలికారు. ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో ఈ మేరకు ట్రంప్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలని నేను కోరుకుంటున్నానని. దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం అన్నారు. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయని..ప్రస్తుతం అవి లేవు అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఓ వైపు అణు పరీక్షలకు ఏర్పాట్లు..ఇంకోవైపు అణు నిరాయుధీకరణ మాటలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అణ్వాయుధాలు..అణు నిరాయుధీకరణ అంశాలపై తనదైన శైలీలో విభిన్నంగా గందరగోళంగా స్పందించారు. తాజాగామూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు అమెరికా ఏర్పాట్లు చేస్తుందంటూ ట్రంప్ వెల్లడించారు. అణ్వస్త్ర పరీక్షల నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్‌ కూడా ఉందని పేర్కొన్నారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయని..మా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయన్నారు. మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు అన్నారు. అయితే అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించానంటూ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. అణునిరాయుధీకరణకు అంతా సహకరించాలంటూ మాట్లాడారు.