Typhoon Kalmaegi : ఫిలిప్పీన్స్ లో కాల్మేగీ తుపాన్ బీభత్సం.. 114 మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో కాల్మేగీ తుపాను బీభత్సం సృష్టించడంతో 114 మంది మృతి చెందగా, 127 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 5.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

Typhoon Kalmaegi

న్యూఢిల్లీ : ఫిలిప్పీన్స్‌లో కాల్మేగీ తుపాన్ సృష్టించిన బీభత్సానికి 114 మంది మృత్యువాత పడ్డారు. మరో 127 మంది గల్లంతయ్యారు. కాల్మేగీ తుపాన్ ప్రభావంతో కుండపోత వర్షాలు, భారీ వరదలతో పెను విధ్వంసం ఏర్పడింది. కొన్ని గ్రామాలు వరదల్లో కొట్టుకుపోవడంతో.. 5.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్లిన వైమానిక దళ హెలికాప్టర్‌ అగుసాన్‌ డెల్‌సర్‌ ప్రావిన్సులో కూలిపోయిన ఘటనలో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

సెబూ ప్రావిన్స్‌లో కొన్ని పట్టణాలను వరదలు ముంచెత్తాయి. తుపాన్ నష్టం ఇక్కడే ఎక్కువగా జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రజలు సహాయం కోసం భవనాల పైకి ఎక్కి ఎదురుచూపులు పడుతున్నారని రెడ్ క్రాస్ వెల్లడించింది. తుపాన్ విధ్వంసం నేపథ్యంలో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు.