Site icon vidhaatha

Sheikh Hasina | షేక్​ హసీనా పారిపోవడానికి కొన్ని గంటల ముందు ఏం జరిగింది?

బంగ్లాదేశ్​ మాజీ ప్రధాని షేక్​ హసీనాకు రాజీనామా చేయడం అసలు ఇష్టం లేదు. తను ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకున్న దేశం విడిచివెళ్లడానికి కూడా ఆమె ఇష్టపడలేదని తెలిసింది. దేశం​లో గంటగంటకు పెరుగుతున్న ఆందోళనలను కఠినంగా అణిచివేయాలని ప్రధానమంత్రి షేక్​ హసీనా ఆదేశించినప్పటికీ, రక్షణ విభాగపు, పోలీసు ఉన్నతాధికారులు, బలప్రయోగంతో ఆందోళనలను అరికట్టలేమని ఆమెకు తేల్చిచెప్పినట్లు డైలీ ప్రొథం అలో వార్తాపత్రిక తెలిపింది. ప్రధాని మిలిటరీ విమానంలో పారిపోవడానికి, ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి చొచ్చుకురావడానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందో ఆ పత్రిక వివరించింది.

ఆరోజు ఉదయం ప్రధాని(Prime Minister Sheikh Hasina) రక్షణ, పోలీసు ప్రధానాధికారులను తన నివాసానికి పిలిపించుకుని ఒక మీటింగ్(Meeting with Security and Police chiefs)​ పెట్టింది. క్షణక్షణానికి మరణాలు పెరుగుతుండడంతో ఆందోళన చెందిన ఆమె ముఖ్య సలహాదారులు, సైన్యానికి అధికారాన్ని అప్పగించమని విజ్ఞప్తి చేసారు. అప్పటికే దాదాపు 300మంది(above 300 dead) ఆందోళనల్లో మరణించారు. కానీ హసీనా(Hasina adamant) ససేమిరా దానికి ఒప్పుకోకపోగా, అప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూ(Curfew)ని మరింత బలోపేతంగా మార్చాలని అధికారులకు చెప్పారు. అప్పటికే వీధుల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తూ, ఢాకా(Dhaka)లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా గుమిగూడారు. ప్రధాని తన మీటింగ్​లో ఉన్నతాధికారులనుద్దేశించి, పరిస్థితిని వారెందుకు నియంత్రించలేకపోతున్నారని నిలదీసారు. పోలీసు వాహనాల పైకెక్కి ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టివీలో వారికి చూపిస్తూ, భద్రతాబలగాలు వారిపట్ల కఠినంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నాయని ప్రశ్నించారు. ఒకానొక స్థితిలో, తాను వారిని నమ్మి ఈ హోదాలలో కూర్చోబెట్టినట్లు గుర్తుచేస్తూ, అటువంటిది ఈ సమయంలో వారి నిష్క్రియాపరత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే మీటింగ్​లో పోలీసుల పనితీరును మెచ్చుకున్న హసీనాతో పోలీస్​ చీఫ్​, పరిస్థితిని తాము ఎంతో సేపు అదుపు చేయలేమని చెప్పినట్లు సమాచారం.

రక్షణ యంత్రాంగం ప్రధానికి యదార్థ పరిస్థితిని వివరిస్తూ, మరింత బలప్రయోగం సమర్థనీయం కాదని(force is not the answer) తెలిపినా, ఆమె వినలేదు. అప్పుడు వారు హసీనా సోదరి రెహనా(Sheikh Rehana)ను వేరే గదిలో కలుసుకుని, ప్రధానిని పదవి నుండి దిగిపోవాల్సిందిగా నచ్చజెప్పాలని కోరారు. రెహనా సోదరితో మాట్లాడినా ఉపయోగం లేకపోయింది. ఇక అప్పుడు అమెరికాలో ఉంటున్న హసీనా (Hasina’s Son)కుమారుడు సజీబ్​ వాజెద్​ జాయ్​(Sajeb Wajed Joy) రంగంలోకి దిగాడు. తన తల్లితో మాట్లాడి రాజీనామాకు ఒప్పించాడు. ఒక ఇంగ్లీష్​ టీవీ చానెల్​తో మాట్లాడుతూ, “ఈ ఉదయం అమ్మతో మాట్లాడాను. బంగ్లాదేశ్​ పరిస్థితి చాలా అరాచకం(Anarchy)గా ఉంది. అమ్మ మాత్రం ఉత్సాహంగానే ఉంది కానీ, చాల నిరాశ చెందింది. బంగ్లాదేశ్​ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేదే ఆమె కల. గత 15ఏళ్లుగా తీవ్రవాదులపై, తీవ్రవాదంపై పోరాడుతోంది. అయినా, ఇప్పుడు దేశం ప్రతిపక్షం, తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది” అని అన్నారు.

 

సమయం అంతకంతకూ మించిపోతోంది. ఆందోళనకారులు లెక్కకుమించి పెరిగిపోతుండం, ఏ క్షణంలోనైనా వారు ప్రధాని నివాసం, గణభబన్(Ganbhaban)​ను ముట్టడించవచ్చనే నిఘావర్గాల సమాచారంతో అధికారులు షేక్​ హసీనాకు తన సామాగ్రి ప్యాక్​ చేసుకోవడానికి 45 నిమిషాల సమయం ఇచ్చారు. ఆమె దేశ ప్రజలనుద్దేశించి ఒక ఆఖరి సందేశం రికార్డ్​ చేద్దామనుకున్నారు కానీ, సమయం చాల్లేదు. వెంటనే తన సోదరి రెహనాతో కలిసి అధికార నివాసం వదలిపెట్టారు. దార్లో కొన్ని నిమిషాలు అధ్యక్షుడి అధికార నివాసం బంగభబన్(Bangabhaban)​లో ఆగి, రాజీనామా తతంగం(Resignation formalities) పూర్తి చేసింది. అనంతరం 76 ఏళ్ల పదవీచ్యుత ప్రధాని మధ్యాహ్నం 2.30 గంటలకు తన 15ఏళ్ల సుదీర్ఘ పదవీకాలానికి తెరదించి, సైనిక విమానం(Military Aircraft)లో దేశం విడిచి వెళ్లింది. తన తండ్రి, బంగ్లాదేశ్​ స్వాతంత్ర్యసమర యోధుడు, బంగబంధుగా ముద్దుగా పిలుచుకునే షేక్​ ముజిబుర్​ రహ్మాన్​( Sheikh Mujibur Rahaman)విముక్తి పోరాటం చేసిన యాభై ఏళ్ల తర్వాత , ఆయన విగ్రహాలను ఒకపక్క అల్లరిమూకలు ధ్వంసం(Statues vandalised) చేస్తుంటే, షేక్​ హసీనా మరోపక్కనుండి దేశం విడిచి పారిపోవాల్సివచ్చింది.

అసలు ఇలా ఎందుకు జరిగింది?

ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs)లో స్వాతంత్ర్య సమరయోధుల(ముక్తి జోధాలు- Muktijoddhas) వారసులకు 30శాతం(30% Reservations) రిజర్వేషన్లు కల్పిస్తూ, హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ఆందోళనలకు అసలు మూలం. అయితే ఈ విధానాన్ని ఆందోళనకారులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మళ్లీ అధికార పార్టీ అయిన అవామీ లీగ్​( Awami League) మద్దతుదారులకే సహకరిస్తుందని, తమకు మెరిట్​ ఆధారిత (Merit-based)నియామకాల పద్ధతే కావాలని పట్టుబట్టారు. కాగా, ఆందోళనలు క్రమంగా విస్తరిస్తూ ఉంటే, ప్రభుత్వం వాటిని ఉక్కుపాదంతో అణిచివేసింది. ఈ దశలో ప్రధాని షేక్​ హసీనా చేసిన ఒక వ్యాఖ్య(Remark) మళ్లీ మంటలను రేపింది. ఈ సారి భయంకరంగా. “ఉద్యోగాలు స్వాతంత్ర్యసమరయోధుల(freedom fighters) పిల్లలకు కాకపోతే, ఎవరికివ్వాలి? రజాకార్ల(Razakars) పిల్లలకా?” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 1971 విముక్తి పోరాటంలో పాకిస్తాన్​(Pakistan) నియమించిన పారామిలిటరీ బలగాలనే రజకార్లుగా పిలుస్తారు. వారు అప్పట్లో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. మూకుమ్మడి హత్యలు, మానభంగాలు, దోపిడీలు, హింసతో వారు బంగ్లావాసులకు ప్రత్యక్ష నరకం చూపించారు. హసీనా ఉన్నట్టుండి ఈ పోలిక తేవడంతో, ఆందోళనకారుల కోపాగ్నికి ఆజ్యం తోడైనట్టైంది.

బంగ్లాలో ఈ రిజర్వేషన్ల సమస్య ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా రగులుతూనే ఉంది. 2018లో ఒకసారి దీనిపై అల్లర్లు చెలరేగితే, ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను బుట్టదాఖలు చేసింది. ఇప్పుడు ఒక హైకోర్టు(high court) అప్పుడు ప్రభుత్వం రద్దు చేసిన రిజర్వేషన్ల పద్ధతిని పునరుద్ధరిస్తూ తీర్పు వెలువరించింది. దీన్నే హసీనా ప్రభుత్వం కోర్టు తీర్పును సాకుగా చూపుతూ, మళ్లీ అమలుచేసే చర్యలు చేపట్టడంతో పరిస్థితి ఇంతదాకా వచ్చింది. ఆ తర్వాత బంగ్లా సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ఈ రిజర్వేషన్లను రద్దు చేసినా, ఆందోళనలు మాత్రం ఆగలేదు. ప్రధానిని దేశం నుంచి వెళ్లగొట్టేదాకా విశ్రమించలేదు. బహుశా ఇప్పట్లో ఆగేలాలేవు కూడా. అసలు సమస్యకు మూలకారణం రద్దైనా ఆందోళనలు ఆగకపోవడం సందేహాలకు తావిస్తోంది. హసీనా కుమారుడు సజీబ్​ వాజెద్​ జాయ్ ఈ ఆందోళనల్లో పాకిస్తాన్​ నేరుగా పాల్గొంటోందని, అమెరికా హస్తం కూడా ఉందని తాను నమ్ముతున్నానని అనడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు ఢిల్లో​లో ఈనాటి అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్​ కూడా ఇంచుమించూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.

Exit mobile version