చైనాలోని వైద్యులు ఒక అద్భుతానికి నాంది పలికారు. పంది కాలేయాన్ని మనిషికి అమర్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా చేసిన ఈ శస్త్రచికిత్సలో, ఆ రోగి 171 రోజుల పాటు జీవించి, వైద్య చరిత్రలో కొత్త పేజీని తెరిచాడు. చైనా అన్హుయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఫస్ట్ అఫ్లియేటెడ్ హాస్పిటల్ లో 71 ఏళ్ల వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది కాలేయాన్ని అమర్చారు. ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్సను పోయినేడాది మార్చి లో నిర్వహించారు. ఆ వ్యక్తి 171 రోజులపాటు జీవించాడు.
మొదటి 38 రోజుల పాటు పంది కాలేయం పూర్తిగా పనిచేసిందని వైద్యులు తెలిపారు. అనంతరం, రోగి స్వంత కాలేయం కొంతమేర పనిచేయడం ప్రారంభించడంతో, పంది కాలేయాన్ని శరీరం నుండి తొలగించారు. దురదృష్టవశాత్తు, కొన్ని తీవ్రమైన సమస్యల వల్ల ఆ వ్యక్తి మరణించాడు. అయినప్పటికీ, వైద్యులు ఈ ప్రయోగాన్ని “ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్”, అంటే భవిష్యత్తులో పంది అవయవాలను మానవులకు ఉపయోగించగలమని నిరూపించే కీలక దశగా పేర్కొన్నారు.
జన్యు మార్పిడి… ఎందుకు?
ట్రాన్స్ ప్లాంట్ ప్రక్రియ చేసినప్పుడు సాధారణంగా మన శరీరం దాన్ని శరీరానికి సంబంధించని దానిగా పరిగణించి రిజెక్ట్ చేస్తుంది. అందుకే చాలా సందర్భాల్లో ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ ఫెయిలయ్యే అవకాశం ఉంటుంది. పంది కాలేయాన్ని అమర్చాలి కాబట్టి, దాన్ని మనిషి శరీరం రిజెక్ట్ చేయకుండా ఉండటం కోసం దానిలో పది రకాల జన్యు మార్పులు చేశారు. ఈ మార్పుల వల్ల పంది కాలేయాన్ని అమర్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని రిజెక్ట్ చేసి, దాడి చేయకుండా నిరోధిస్తాయి. పంది కాలేయం ప్రోటీన్ ఉత్పత్తి, బైల్ తయారీ, రక్త శుద్ధి వంటి కీలక పనులను సాధారణంగా నిర్వహించింది. ఇది కాలేయ మార్పిడి రంగంలో ఒక “మైలురాయి ప్రయోగం”గా భావిస్తున్నారు.
ఎదురైన సమస్యలు
రోగి శరీరంలో కొన్ని వారాల తర్వాత రక్తం గడ్డలు ఏర్పడటం (క్జినోట్రాన్స్ ప్లాంట్ రిలేటెడ్ థ్రాంబోటిక్ మైక్రోఆంజియోపతి), గాస్ట్రోఇంటెస్టినల్ రక్తస్రావం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. చివరికి ఇవే అతని మరణానికి కారణమయ్యాయి. అయితే, ఇలాంటి సంక్లిష్టతలను భవిష్యత్తులో నియంత్రించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని దీన్ని నిర్వహించిన వైద్యులు తెలిపారు.