Maoist Surrender | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 21 మంది మావోల లొంగుబాటు

మావోయిస్టు పార్టీ బలహీన పడిపోతోంది. తాజాగా ఆదివారం ఛత్తీస్ ఘడ్ లో కూడా మరో 21 మంది మావోయిస్టులు లొంగుబాట పట్టారు.

విధాత :
జనం కోసం వనంలోకి వెళ్లిన మావోయిస్టు పార్టీకి గత కొన్ని నెలలుగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల పార్టీలోని కీలక నేతలు ఒకరొకరుగా పార్టీతో పాటు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కేవలం మావోయిస్టులే కాకుండా వారి వెంట ఉన్న ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ పరిణామాలతో మావోయిస్టు పార్టీ బలహీన పడిపోతోంది. తాజాగా ఆదివారం ఛత్తీస్ ఘడ్ లో కూడా మరో 21 మంది మావోయిస్టులు లొంగుబాట పట్టారు. రాయ్ పూర్ జిల్లాలోని బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పీ.సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన వారిలో కేశ్ కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులు ఉన్నారు.

వీరు మూడు ఏకే-47 రైఫిళ్లు, నాలుగు ఎస్ఎల్ఆర్ లు, రెండు ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లు, ఆరో నంబర్ 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ ఆయుధాన్ని సరెండర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారిలో కేశ్‌కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేశ్, మావోయిస్టులు కుయెమారి, కిస్కోడో ఏరియా కమిటీ, కేశ్ కాల్ డివిజన్(నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందిన వారున్నారు. కాగా, ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల్లో నాలుగురు డివిజన్ స్థాయి కమాండర్లు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులుండగా.. ఎనిమిది మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు వివరించారు. ఇక 21 మంది మావోయిస్టుల్లో 13 మంది మహిళలు ఉండగా మిగిలిన వారు పురుషులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.