విధాత: తెలంగాణ, ఏపీ, చత్తీస్ గఢ్, మహారాష్ట్రాలలో వరుసగా మావోయిస్టుల లొంగుబాటు, ఆపరేషన్ కగార్ పేరుతో వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టు పార్టీ రోజురోజుకు వరుస ఎదురుదెబ్బలు తింటుంది. తాాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 32 మంది తలపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మార్చి మాసాంతానికి మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ ను ముమ్మరం చేశాయి.
ఇదిలా ఉండగా మరోవైపు సాయుధ పోరాట విరమణ(ceasefire )పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన(Maoist party statement) చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని..అయితే ముందుగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూంబింగ్ ఆపరేషన్స్ , ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల(mmc) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ ఓక ప్రకటనలో తెలిపారు. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే సాయుధ పోరాట విరమణపై తేదీని ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. ఎప్పటి నుంచి కూంబింగ్ ఆపరేషన్స్ నిలిపివేస్తే అప్పటినుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని..అయితే తమకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని కోరారు.