Vermicompost Business | మధ్యప్రదేశ్( Madhya Pradesh )లోని రాట్లంకు చెందిన తికమ్‌చంద్ జోగ్ చంద్( Tikamchand Jogchand ), అమిత్ కుమావత్( Amit Kumavat ) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇక ఇద్దరూ కలిసి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు. ఆ ఆలోచనతో ఇద్దరూ కలిసి వర్మీకంపోస్టు బిజినెస్( Vermicompost Business ) చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వీరి వర్మీకంపోస్ట్ యూనిట్స్ రాట్లం జిల్లా( Ratlam District )లో అతిపెద్ద యూనిట్లుగా పేరుగాంచాయి. ఏడాదికి 900 టన్నుల వరకు వర్మీకంపోస్టును ఉత్పత్తి చేస్తూ ఏడాదికి రూ. 70 లక్షలు సంపాదిస్తున్నారు.
పది అయిపోయాక అగ్రికల్చర్ కోర్సులు
జోగ్‌చంద్, అమిత్ కుమావత్ రాట్లంలోనే పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. పది అయిపోయాక వ్యవసాయ కోర్సులు చేయాలని వారి టీచర్లు వారిద్దరిని ఎంకరేజ్ చేశారు. దీంతో ఇద్దరు కలిసి మధ్యప్రదేశ్ ప్రీ అగ్రికల్చర్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. జబల్‌పూర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌లో జోగ్ చంద్ పట్టా పుచ్చుకున్నాడు. అమిత్ కుమావత్ బీఎస్సీ పీసీమ్ పూర్తి చేశారు. 2017లో వీఎన్ఆర్ సీడ్స్‌లో అమిత్‌కు ఉద్యోగం లభించింది. 2020 వరకు అదే కంపెనీలో వర్క్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వ్యవసాయ రంగంలో ఏదైనా బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారు.
తొలి ప్రయత్నం.. రూ. 22 వేల పెట్టుబడితో..
అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి, లాభాలు వచ్చే బిజినెస్‌ను ఎంచుకున్నారు. అదే వర్మీకంపోస్టు బిజినెస్. ఆవుపేడ, వానపాములను సేకరించడం కూడా సులభం. ఇక 2018 మార్చి నెలలో అమిత్ తండ్రి నుంచి భూమిని కౌలుకు తీసుకున్నారు. మూడు ట్రాక్టర్ల ఆవుపేడను సేకరించారు. 19 ఫీట్ల పొడవు, 3.5 ఫీట్ల అడ్డంతో ఆరు బెడ్లను తయారు చేశారు. ఇక 35 కేజీల వానపాములను కొనుగోలు చేశారు. వానపాముల కోసం రూ. 10 వేలు వెచ్చించారు. ఆవుపేడకు రూ. 12 వేలు ఖర్చు పెట్టారు.
3 నెలల్లోనే వర్మీకంపోస్టు రెడీ..
మూడు నెలల తర్వాత వర్మీకంపోస్టు చేతికొచ్చింది. 2018 జూన్ నాటికి ఆరు బెడ్ల నుంచి 36 క్వింటాళ్ల వర్మీకంపోస్టు రెడీ అయింది. కేజీ, 2 కేజీల చొప్పున వర్మీకంపోస్టు ప్యాకెట్లను తయారు చేసి.. కేజీ ప్యాకెట్‌ను రూ. 40కి విక్రయించారు. తమ గ్రామం నుంచి రాట్లం పట్టణానికి 14 కిలోమీటర్లు ప్రయాణించి.. కాలనీల్లో గార్డెనింగ్ కోసం వర్మీకంపోస్టును విక్రయించారు. ఆయా కాలనీవాసుల నుంచి కూడా అనూహ్య స్పందన వచ్చింది. గార్డెనింగ్ కోసం విరివిగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఐదు కిలోల వరకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. రైతులైతే క్వింటాళ్ల రూపంలో తీసుకున్నారు.
ఆరు బెడ్ల నుంచి 50 బెడ్లకు
2021 నాటికి వర్మీకంపోస్టుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆరు బెడ్ల నుంచి 50 బెడ్లకు విస్తరించారు. దీని కోసం 25 ట్రాలీల వరకు ఆవు పేడను సేకరించారు. 280 క్వింటాళ్లకు ఎదిగారు. 2024 నాటికి రైతులకు వర్మీకంపోస్టుపై శిక్షణా తరగతులు ఇవ్వడం ప్రారంభించారు. రైతులు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా వర్మీ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలో నేర్పించారు. ఆర్గానిక్ ఎరువులను వినియోగించడం ద్వారా పంట దిగుబడిపై కూడా అవగాహన కల్పించడంతో.. రైతులు వర్మీకంపోస్టును తయారు చేసుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో వీరే సొంతంగా రైతులకు వానపాములను విక్రయించడం మొదలుపెట్టారు. ఈసినా ఫెటిడా వెరైటీకి చెందిన వానపాములను కేజీకి రూ. 3 వేల నుంచి రూ. 4 వేల చొప్పున విక్రయించారు. వానపాములతో పాటు ఆవుపేడ, మొక్కజొన్న ఆకులు, గోధుమ గడ్డిని ఉపయోగించి వర్మీకంపోస్టును తయారు చేయడం మొదలుపెట్టారు రైతులు. ఇలా రాత్రి సమయాల్లో వర్మీకంపోస్టుపై రైతులకు అవగాహన కల్పిస్తూ.. పంట దిగుబడులపై నైపుణ్యం కలిగించారు.
ఏడాదికి రూ. 70 లక్షలు సంపాదిస్తున్నారు..
ప్రస్తుతం జోగ్‌చంద్, అమిత్ కలిసి 1.5 ఎకరాల్లో 400 బెడ్లలో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నారు. ప్రతి బెడ్ 30 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల అడ్డం ఉంటుంది. ఈ యూనిట్ల ద్వారా ఏడాదికి 900 టన్నుల వర్మీకంపోస్టును తయారు చేస్తున్నారు. ఇక రైతులకు ఒక ట్రాలీ వర్మీకంపోస్టును రూ. 5 వేలకు విక్రయిస్తున్నారు. గార్డెనింగ్ చేసే వారికి కూడా విక్రయిస్తున్నారు. ఇలా ఏడాదికి రూ. 70 లక్షలు సంపాదిస్తున్నారు.
