Gold, Silver price fall| తగ్గిన బంగారం ధరలు..  ఇప్పుడు కొనవచ్చా ?

బంగారం, వెండి ధరలు వరుసగా భారీగా పతనమవుతున్నాయి. మంగళవారం 24క్యారెట్ల బంగారం ధర రూ.1,420 తగ్గి రూ.1, 51, 750కి పడిపోయింది. కిలో వెండి ధర రూ.20,000తగ్గి.. రూ. 2,80,000కు పడిపోయింది.

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు వరుసగా భారీగా పతనమవుతున్నాయి. మంగళవారం 24క్యారెట్ల బంగారం ధర రూ.1,420 తగ్గి రూ.1, 51, 750కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,300తగ్గి రూ.1,39,100వద్ద నిలిచింది. జనవరి 29న తులం బంగారం ఆల్ టైమ్ రికార్డు ధర 1,78,850 నుంచి ఐదు రోజుల్లో ఏకంగా రూ. 27,100తగ్గడం గమనార్హం.

రూ.20వేలు తగ్గిన కిలో వెండి ధర

వెండి ధరలు సైతం భారీ పతనాన్ని నమోదు చేశాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.20,000తగ్గి.. రూ. 2,80,000కు పడిపోయింది. జనవరి 29న నమోదైన ఆల్ టైమ్ రికార్డు ధర రూ.4,25,000నుంచి ఏకంగా రూ.1,45,000 తగ్గడం వెండి ధరల అనూహ్య పతనాన్ని సూచిస్తుంది.

ఇప్పుడు కొనవచ్చా…ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?

బంగారం, వెండి ధరలు రోజురోజుకు పడిపోతున్న తరుణంలో ఇప్పుడు వాటి కొనుగోలు మంచిదా?..లేక మరింత తగ్గుతుందా..పెరుగుతుందా ? అన్న సందేహాలు కొనుగోలుదారులను పీడిస్తున్నాయి. దీనిపై ప్రముఖ ఆర్థిక నిపుణులు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి స్పందిస్తూ… బంగారం, వెండి ధరల తగ్గుదల అవకాశాన్ని సానుకూలంగా చూడాలని, కొనుగోలు చేసే అరుదైన అవకాశంగా భావించాలని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులపై లాభర్జనకు దిగుతున్నందునా.. తాను మరిన్ని కొనుగోలు చేయడానికి నగదుతో సిద్ధంగా ఉన్నానని కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోహాల ధరల తగ్గుదలను నష్ట సంకేతాలుగా కాకుండా.. దీర్ఘకాలిక సంపద నిర్మాణానికి అవకాశాలుగా చూడాలన్నారు. ముఖ్యంగా వెండి తాత్కాలికంగా తగ్గినప్పటికి…  దీర్ఘకాలంలో మళ్లీ పుంజుకుంటుందన్నారు. పారిశ్రామిక లోహంగా వెండికి ఉన్న డిమాండే ఇందుకు కారణం అన్నారు. కరెన్సీల విలువ తగ్గే ప్రమాదం ఉన్నప్పుడు, బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే రక్షణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest News