నాదం చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలు
పల్లా కాలేజీపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Anurag University । చెరువుల కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలపై కొరడా ఝళిపిస్తున్న హైడ్రా.. ఇప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం సంచలనం రేపింది. అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా సహించేది లేదని సంకేతాలు ఇచ్చిన హైడ్రా.. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో తాజా టార్గెట్‌గా బీఆరెస్ మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారని అర్థమవుతున్నది. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీని నాదం చెరువును కబ్జా చేసి నిర్మించారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ చెరువును మిషన్ కాకతీయ రెండో విడుతలో పునరుద్ధరించారు. ఘటకేసర్ ఇరిగేషన్ సెక్షన్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఏ పరమేశ్.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాలేజీపై ఐటీసీ, పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కాలేజీ నిర్మాణాలు చెరువు బఫర్ జోన్‌లో ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు. ఘటకేసర్ మండలం, వెంకటాపూర్ లోని కాలేజీని తాను సందర్శించినప్పుడు బఫర్ జోన్‌లో నిర్మాణాలను గుర్తించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.