Montha Cyclone | సాంకేతికత సాయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు : హోం మంత్రి అనిత

అత్యాధునిక సమాచార సాంకేతికత సాయంతో ‘మొంథా’ తుపాను నష్ట నివారణకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

అమరావతి :

అత్యాధునిక సమాచార సాంకేతికత సాయంతో ‘మొంథా’ తుఫాను నష్ట నివారణకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం హై అలెర్ట్ గా ఉందని చెప్పారు. గతంలో సంభవించిన తుఫాన్ల సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన ముందస్తు చర్యలను చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్ర అధికారులతో పలుమార్లు కాన్ఫరెన్స్ లు నిర్వహించి అప్రమత్తం చేసినట్లు చెప్పారు.

ఇదే అంశంపై గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర ప్రజలను పలు మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేసినట్లు మంత్రి అనిత తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్షణ చర్యలు చేపట్టేందుకు అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించినట్లు చెప్పారు. 6 ఎన్‌డీ‌ఆర్‌ఎఫ్, 13 ఎస్డీ‌ఆర్ఎఫ్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హెలికాప్టర్‌లతో నావెల్ అధికారులను సిద్ధం చేయడంతో పాటు అన్నిచోట్ల హెలీపాడ్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అవసరం అయితే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి కూడా హెలికాప్టర్ లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో 14 బోట్లను కూడా సిద్ధం చేశామన్నారు. మొంథా తుఫాను సందర్భంగా గంటకు 100 కిలోమీటర్ల పైబడి భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని రకాల హోర్డింగ్లను తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తుఫాను కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ల టోల్ నెంబర్ కు ఫోన్ చేసి స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చని, తక్షణ సహాయం కూడా పొందవచ్చు అని మంత్రి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, తక్షణ సహాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని హోం మంత్రి అనిత సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, తదితరులు పాల్గొన్నారు.